‘ఉపాధి’ అక్రమాలకు చెక్‌

రాఘవాపూర్‌లో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌) - Sakshi

సిద్దిపేటరూరల్‌: ఉపాధిహామీని పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రకరకాల మార్పులు చేస్తోంది. గ్రామాల్లో అర్హులైన కూలీలకు ప్రతీ రోజు పని కల్పించేందుకు వారి జాబ్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. జాబ్‌కార్డు ఉండి పనికి వెళ్లకుండా ఉండేవారిని ఇనాక్టివ్‌గా గుర్తించి క్రమంగా జాబితా నుంచి తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇంత కాలం పనికి వెళ్లకుండా కూలి డబ్బులు పొందుతున్న వారికి చెక్‌ పడనుంది.

అనుసంధానం తప్పనిసరి..

● ఇటీవల నూతన సిస్టం ద్వారా పరిమితితో కూడిన పనులు, హాజరు నమోదునకు మొబైల్‌ మానిటరింగ్‌, డబ్బు చెల్లింపులోనూ నూతన విధానం ప్రవేశపెట్టింది.

● జిల్లాలో రోజువారిగా 2,36,561 మంది కూలీలు పనిచేస్తున్నారు. వీరిలో 2,33,815 మంది జాబ్‌కార్డుతో ఆధార్‌ అనుసంధానం పూర్తయింది.

● ఆధార్‌లో పొరపాట్లు ఉన్నవారు కూడా అనుసంధానం చేసుకుంటే వంద శాతం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

● కూలీల జాబ్‌కార్డుకు ఆధార్‌కార్డును అనుసంధానం చేసి, పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

● ఉపాధి హామీ కూలీలకు ప్రస్తుతం పోస్టల్‌, బ్యాంకుల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా వివరాలు

జాబ్‌కార్డులు – 2,01,841

మొత్తం కూలీలు – 4,07,689

యాక్టివ్‌ కార్డులు – 1,36,263

ఇనాక్టివ్‌ కార్డులు – 65,578

యాక్టివ్‌ కూలీలు – 2,36,561

ఇనాక్టివ్‌ కూలీలు – 1,71,128

జాబ్‌కార్డుతో ఆధార్‌ అనుసంధానం

క్రమంగా ఇనాక్టివ్‌ కూలీల గుర్తింపు

ఆందోళన వద్దు

జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న కూలీలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పటికే వారందరికీ ఆధార్‌ అనుసంధానం పూర్తయింది. అర్హులైన కూలీలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇనాక్టివ్‌ కూలీలు, జాబ్‌ కార్డు వివరాల నమోదులో సమస్యలతో కొన్ని తిరస్కరణకు గురవుతున్నాయి. ఆధార్‌ లింక్‌ చేసిన వారి ఖాతాలో కూలీ డబ్బులు జమ అవుతాయి.

– చంద్రమోహన్‌ రెడ్డి, ఇన్‌చార్జ్‌ డీఆర్‌డీఓ, సిద్దిపేట

Read latest Siddipet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top