తల్లిపాల బ్యాంక్‌

సిద్దిపేట జీజీహెచ్‌  - Sakshi

సాక్షి, సిద్దిపేట: అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప.. అంతకంటే గొప్పది తల్లిపాల దానం. తల్లిపాల దానంతో చిన్నారులకు ప్రాణ, ఆరోగ్య భిక్ష పెట్టవచ్చు. వివిధ కారణాలతో పాలు అందని నవజాత శిశువులకు తల్లి పాలను అందించేందుకు ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అమ్మ పాలను సేకరించి నిల్వ చేసేందుకు సిద్దిపేట జీజీహెచ్‌ను ఎంపిక చేశారు. మంత్రి హరీశ్‌ రావు చొరవతో జిల్లాలోని ప్రభుత్వ బోధన ఆస్పత్రికి(జీజీహెచ్‌) మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ మంజూరైంది. త్వరలో అందుబాటులోకి రానున్నడంతో తల్లి పాలు లేని నవజాత శిశువుల ఇక్కట్లు తీరనున్నాయి.

సంపూర్ణ ఆరోగ్యానికి

● తల్లి పాలతో బిడ్డ ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతాయి. శిశువులలో అతిసార వ్యాధి, న్యుమోనియా రాకుండా నివారించవచ్చు. తద్వారా శిశు మరణాల సంఖ్య తగ్గుతుంది.

● తల్లిపాలు తాగిన పిల్లల్లో ఊబకాయం, మధుమేహ వ్యాధులు తక్కువగా కనిపిస్తాయి.

● పోషకాలు ఉండే తల్లిపాలకు నవజాత శిశువులు దూరం కావొద్దనే ఉదేశ్యంతో సిద్దిపేట జీజీహెచ్‌లో మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

● రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రూ.34లక్షలతో మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌కు శ్రీకారం చుట్టారు.

● జీజీహెచ్‌లో ప్రత్యేక గదిని కేటాయించి పాలను నిల్వ చేయనున్నారు.

● బిడ్డకు ఇవ్వగా మిగులు పాలను సేకరించి వీటిని నిల్వ చేస్తారు. పాలు దానం చేయాలనుకునే దాతలు జీజీహెచ్‌ మిల్క్‌ బ్యాంక్‌కు వచ్చి ఇవ్వొచ్చు.

ఏడాది పాటు నిల్వ

● హెచ్‌ఐవీ, వీడీఆర్‌ఎల్‌ (వెనెరియల్‌ డిసీజ్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ టెస్ట్‌), హెపటైటిస్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వస్తేనే తల్లి పాలు తీసుకుంటారు.

● సేకరించిన తల్లి పాలను ఫ్రీజర్‌లలో స్టోర్‌ చేస్తారు. రెండేళ్ల బిడ్డ వరకు అవసరం ఉన్న వారికి స్టోర్‌ నుంచి పాలను అందిస్తారు.

● కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా ఏడాది పాటు పాలు పాడవకుండా భద్రపరుస్తారు. ఇందుకు ప్రత్యేక యంత్రాలు జీజీహెచ్‌లో ఏర్పాటు చేయనున్నారు.

● ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జీజీహెచ్‌లో 389 డెలివరీలు కాగా అందులో తక్కువ బరువుతో, తక్కువ నెలలకు పుట్టిన వారు సుమారుగా 20శాతం ఉంటున్నారు.

● వీరికి ఎస్‌ఎన్‌సీయూలో(నవజాత శిశు సంరక్షణ కేంద్రం) చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి వారికి, పాలు రానీ తల్లులుంటే వారి పిల్లలకు మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ పాలను అందించనున్నారు.

సిద్దిపేట జీజీహెచ్‌కు మంజూరు

సేకరించిన పాలు ప్రత్యేక గదిలో నిల్వ

రూ.34 లక్షల వ్యయంతో ఏర్పాటు

ప్రత్యేక గదిని కేటాయిస్తాం

నవ జాత శిశువులకు తల్లిపాలు అందించే ఉద్ధేశ్యంతో మంత్రి హరీశ్‌ జీజీహెచ్‌కు మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ను కేటాయించారు. దీని కోసం ఆస్పత్రిలో ప్రత్యేక గదిని కేటాయిస్తాం. త్వరలో అందుబాటులోకి తెచ్చి నవజాత శిశువుల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తాం.

– కిశోర్‌, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌

Read latest Siddipet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top