
లబ్ధిదారులతో మంత్రి హరీశ్ రావు
సిద్దిపేటజోన్: పేదలకు సేవ చేయాలనే తపన అందరిలో ఉండాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన 37మంది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.27 వేలు చొప్పున సుకన్య యోజన పథకం కింద డాక్టర్ రఘురాం అందించిన ఫిక్స్ డిపాజిట్ బాండ్‌లను పంపిణీ చేశారు. అంతకుముందు డాక్టర్ రఘురాం మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావును చూసి పేదలకు సేవ చేయాలని నిర్ణయించుకొని, ఆడపిల్లల భవితకు భరోసా ఇచ్చేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్ కింద 124 మందికి మంజూరైన చెక్కులను, 38 మందికి అసైన్డ్ పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఇద్దరికీ పార్టీ బీమా డబ్బులను అందజేశారు. అనంతరం అర్చక సంఘం పంచాంగ ఆవిష్కరించారు. పంచముఖ ఆలయంలో జరిగే శ్రీరామ నవమి వేడుకలకు హాజరుకావాలని నిర్వాహకులు మంత్రికి ఆహ్వానం అందించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ మాజి చైర్మన్ రాజనర్స్, పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు సాయిరాం, అర్చక సంఘము జిల్లా అధ్యక్షుడు కష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.