
మహామండపంలో చిన్నారుల అక్షరాభ్యాసాల సందడి
వర్గల్(గజ్వేల్): కృత్తిక నక్షత్ర మహోత్సవ వేడుకలతో వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం శోభిల్లింది. ఆదివారం నవరాత్రి పంచమి కలిసిరావడంతో భారీగా చిన్నారుల అక్షరాభ్యాసాలు జరిగాయి. కృత్తిక నక్షత్రం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి లక్ష భస్మార్చన, సరస్వతిదేవికి కుంకుమార్చన నిర్వహించారు. పూజలతో క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిశాయి. ఆలయ వ్యవస్థాపకుడు చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో నిర్వహించిన సుబ్రహ్మణ్యేశ్వర లక్షభస్మార్చన నేత్రపర్వంగా కొనసాగింది. వందలాదిగా తరలివచ్చిన చిన్నారులతో అక్షరపూజ జరిపించి అక్షరాలు దిద్దించారు. దాదాపు 400 అక్షరాభ్యాసాలు జరిగినట్లు ఆలయ మేనేజర్ రఘుపవన్‌రావు తెలిపారు.
తరలివచ్చిన భక్తులు
ఆదివారం సెలవు కావడంతో హైదరాబాద్, సికిందరాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి క్షేత్రానికి భారీగా భక్తులు తరలివచ్చారు. విశేషాలంకరణలో కొలువుదీరిన అక్షర దేవతను, శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కల్యాణ వెంకటేశ్వరస్వామి, స్వయం సిద్ధ శంభులింగేశ్వరుడు, లక్ష్మీగణపతి, శనీశ్వరాలయాలను దర్శించుకుని తరించారు. గన్నవరం శ్రీ నిత్యానందభారతిస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి లక్షభస్మార్చన
కిటకిటలాడిన వర్గల్ క్షేత్రం
సరస్వతీమాతకు కుంకుమార్చన
భారీగా చిన్నారుల అక్షరస్వీకారాలు

విశేషాలంకరణలో సరస్వతీమాత, సుబ్రహ్మణ్యేశ్వరుడు