
కంటైనర్లలో అంగన్‌వాడీ కేంద్రాలు
● నిర్మాణం, డిజైన్ అంశాలపై అధ్యయనం ● తక్కువ వ్యయం ఎక్కువ సౌకర్యాలు
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించనున్నారు. అయితే కొన్నిచోట్ల ఈ భవనాలకు బదులుగా కంటైనర్లతో డిజైన్‌చేసి అందులో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కంటైనర్లతో నిర్మించనున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అవసరమైన అన్ని హంగులను అందులో కల్పించనున్నారు. కంటైనర్లతో డిజైన్ చేయించే అంశాన్ని అధ్యయనం చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల కంటైనర్ కేంద్రాలను పరిశీలించనున్నారు.
వ్యయం తక్కువ
ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో కొన్నిచోట్ల సరైన వసతులు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. కంటైనర్లలో సోలార్ ప్లేట్లు బ్యాటరీ బ్యాకప్‌తో నూతన కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నారు. ఈ విధంగా చేస్తే తక్కువ వ్యయంతో అవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలాచోట్ల కార్యాలయాలు, కౌంటర్లుగా కంటైనర్లను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.
వందరోజుల ప్రణాళిక
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో త్వరలో 100 రోజుల ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నారు. దీంతో కేంద్రాలలో పౌష్టికాహారం సరఫరా, పర్యవేక్షణ నిర్వహణ మరింత బలోపేతం కానుంది. సరైన వసతులు లేని కేంద్రాల్లో సమస్యలు పరిష్కారం కానున్నాయి.
పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ
అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే పౌష్టికాహారాన్ని మరింత మెరుగుపరచనున్నారు. ఇప్పటికే బాలామృతం, పాలు, గుడ్డు తదితర వస్తువులు అందిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో జొన్న రొట్టెలను వినియోగిస్తున్న క్రమంలో పౌష్టికాహార నిపుణులతో చర్చించి, మహిళా సంఘాల సభ్యులతో ఇక్కడ కూడా పిల్లలకు అందించనున్నారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల సేవలను కూడా ఇందుకోసం వినియోగించుకోనున్నారు. గర్భిణులు, బాలింతలు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని బస్తీలు, పలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ అంగన్‌వాడీకేంద్రాలు ఏర్పాటు చేసి, వాహనాల ద్వారా పౌష్టికాహారం సరఫరా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.