
వీవోఏ ఆత్మహత్య కారకులను శిక్షించాలి
మెదక్ మున్సిపాలిటీ: వీఓఏ పద్మ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి, విచారణ జరిపి డబ్బులు రికవరీ చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా అదనపు ఎస్పీ మహేందర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నాగమణి మాట్లాడారు. పోడ్చన్‌పల్లి వీవోఏ పద్మ రాసిన సూసైడ్ నోట్‌లో నిజం ఉందన్నారు. ఆమె చావుకు కారణమైన అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే వారి ద్వారానే డబ్యులు రికవరీ చేయించాలన్నారు. అధికారులు పద్మను బెదిరించి భయబ్రాంతులకు గురిచేసి ఐదేళ్లుగా డ్వాక్రా గ్రూపు నుంచి డబ్బులు స్వాహా చేశారని ఆరోపించారు. కానీ అసలు విషయం గ్రామ ప్రజలకు తెలియదన్నారు. డబ్బులు స్కాంలో బ్యాంకు, ఆడిట్ అధికారులతోపాటు ఏపీఎం ప్రమేయం ఉందని గుర్తు చేశారు. లక్షల రూపాయలు దండుకొని కుంభకోణాన్ని పద్మమీదకు నెట్టారని మండిపడ్డారు. జిల్లాలో 517 గ్రామ సమైక్య సంఘాలు, 13,079 డ్వాక్రా గ్రూపులు, 1,56,942 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ స్పందించి వెంటనే విచారణ జరిపించాలన్నారు.
విచారణ జరిపి డబ్బులు రికవరీ చేయాలి
సీఐటీయూ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీకి ఫిర్యాదు