మీసేవలో వివాహ రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

మీసేవలో వివాహ రిజిస్ట్రేషన్‌

Jul 4 2025 7:11 AM | Updated on Jul 4 2025 7:11 AM

మీసేవ

మీసేవలో వివాహ రిజిస్ట్రేషన్‌

శ్లాట్‌ బుకింగ్‌తో సర్టిఫికెట్లు పొందే సదుపాయం
● పారదర్శకంగా, వేగంగా సేవలు ● ఉమ్మడి జిల్లాలో 492 మీ సేవ కేంద్రాల్లో సదుపాయం

నారాయణఖేడ్‌: పాలనను ప్రజలకు చేరువ చేయడంతోపాటుగా పలు పథకాల అమలు తీరును మరింత పారదర్శకంగా, సులభతరంగా, వేగంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలు తమ పనులకోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోవడం, ఇబ్బందులు పడటం లాంటి పరిస్థితులకు చరమగీతం పాడనుంది. అందులోభాగంగా మీసేవ కేంద్రాల్లో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే 12 రకాల నూతన సేవలు మీసేవ కేంద్రాల ద్వారా అందుబాటులోకి రాగా తాజాగా వివాహ రిజిస్ట్రేషన్‌ (మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌), భూముల మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్స్‌ను పొందేందుకు అవకాశం కల్పించింది. వీటికోసం శ్లాట్‌ బుకింగ్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

ఉమ్మడి జిల్లాలో 492 మీసేవ కేంద్రాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 492 మీసేవ కేంద్రాలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 174, సిద్దిపేటలో 236, మెదక్‌లో 82 కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాల్లో మున్సిపాలిటీ పరిధిలోని ఒక మీసేవ కేంద్రం ద్వారా నెలకు సుమారు వెయ్యిమంది, గ్రామీణ ప్రాంతాల్లో 200 నుంచి 300 మంది వరకు సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం ఏదైనా కొత్త పథకాలను ప్రవేశపెట్టిన సందర్భాల్లో రాజీవ్‌ యువ వికాసం, రేషన్‌ కార్డులు వంటి సదుపాయాలు కల్పిస్తే ప్రజలకు అందే సేవల సంఖ్య మరింతగా పెరుగుతుంది.

వివాహ రిజిస్ట్రేషన్‌ ఇలా

కొత్తగా మీసేవల్లో అమలు చేస్తున్న మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ జారీకి శ్లాట్‌ బుకింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. దరఖాస్తుదారులు పెళ్లి ఫొటోలు, చిరునామా రుజువు, వయస్సు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆమోదించిన అనంతరం సర్టిఫికెట్‌ను ప్రత్యక్షంగా సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం జారీ చేస్తుంది.

మార్కెట్‌ వాల్యూసేవలు కూడా

మీసేవ కేంద్రం లేదా ఆన్‌లైన్‌లో జిల్లా, గ్రామం వంటి వివరాలను సమర్పించాలి. దీంతో భూమికి సంబంధించి తాజా మార్కెట్‌ వాల్యూ పొందవచ్చు.

మీసేవ ద్వారా వివాహ రిజిస్ట్రేషన్‌ సేవలు

ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన వివాహ సర్టిఫికెట్‌, మార్కెట్‌ విలువ సర్టిఫికెట్‌లను శ్లాట్‌ బుకింగ్‌ సేవలను మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలు వినియోగించుకోవచ్చు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రజల నుంచి అధిక రుసుము వసూలు చేయకుండా కేంద్రాన్ని నిబంధనల ప్రకారం నిర్వహించాలి. అధిక వసూళ్లు లేదా ఫేక్‌ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాం.

– ఉదయ్‌కుమార్‌,

ఈ– జిల్లా మేనేజర్‌, మీసేవ, సంగారెడ్డి

కొత్తగా 12 రకాల సేవలు

ఇటీవల ప్రభుత్వం మీసేవ ద్వారా కొత్తగా 12 రకాల సేవలను అదనంగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. మీసేవ ద్వారా రేషన్‌ కార్డుల దరఖాస్తు, మైనార్టీ సర్టిఫికెట్స్‌, ఎడ్యుకేషన్‌ గ్యాప్‌ సర్టిఫికెట్స్‌తోపాటు కొత్తగా వివాహ రిజిస్ట్రేషన్‌, మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్‌ సేవలు తదితరాలను అదనంగా అందుబాటులోకి తీసుకు వచ్చారు. మీసేవ ద్వారా ఆర్టీఏ, పాన్‌, ఇసుక బుకింగ్‌ వంటి సేవలు కూడా అందుతున్నాయి. భూమి, అపార్ట్‌మెంట్‌ విలువల అంచనాలను 24గంటల్లో ఆమోదించేలా చర్యలు చేపడుతున్నారు. ఇకపై టీ–ఫైబర్‌, అదనపు కియాస్క్‌లు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను మరింత దగ్గర చేస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఇటీవల వెల్లడించారు.

మీసేవలో వివాహ రిజిస్ట్రేషన్‌1
1/2

మీసేవలో వివాహ రిజిస్ట్రేషన్‌

మీసేవలో వివాహ రిజిస్ట్రేషన్‌2
2/2

మీసేవలో వివాహ రిజిస్ట్రేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement