అంతర పంటలతో ఆదాయం | - | Sakshi
Sakshi News home page

అంతర పంటలతో ఆదాయం

Jun 11 2025 11:52 AM | Updated on Jun 11 2025 11:52 AM

అంతర పంటలతో ఆదాయం

అంతర పంటలతో ఆదాయం

పప్పుధాన్యాలు సాగు చేస్తే మేలు

ప్రధాన పంటకు

ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు

సాగుపై సూచనలు చేస్తున్న అధికారులు

కొల్చారం(నర్సాపూర్‌): సాధారణంగా రైతులు ఒక కాలంలో ఒకే పంటను సాగు చేస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడద వల్ల పంట నష్టపోతే రైతు ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. సరైన ప్రణాళికతో, అవగాహనతో రెండు లేదా మూడు పంటలను ఒకేసారి సాగు చేయవచ్చు. ఒకటి ప్రధానపంట, రెండవదీ అంతర పంట. ప్రధాన పంటతోపాటు అంతర పంటలుగా పప్పు దినుసులను సాగు చేయడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనమని కొల్చారం మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి పేర్కొన్నారు.

ప్రయోజనాలు

ఒక పంట నష్టపోతే రెండవ పంట నుంచి రాబడి సంపాదించి, నష్టాన్ని భర్తీ చేయవచ్చు. రైతు పొలం నుంచి ఒకేసారి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. పోషక పదార్థాల వినియోగ సామర్థ్యం పెంచవచ్చు. కలుపు మొక్కలు రాకుండా నివారించవచ్చు. సహజ వనరులైన నేల, నీరు, సూర్యరశ్మిని పంటల మధ్యనున్న ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నేల కోతను అరికట్టవచ్చు. పంటల నాణ్యతను పెంచవచ్చు. పుష్పజాతి మొక్కలు, గడ్డిజాతి ధాన్యపు మొక్కలతో భూ సారాన్ని పెంచవచ్చు. సరైన పద్ధతిలో పంటల్ని ఎంచుకొని అంతర పంటలు పండించడం ద్వారా ప్రధాన పంటపై ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు.

భూసారాన్ని పెంచుతాయి

పప్పుధాన్యాల పంటలు రాల్చిన ఆకులు కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది. వాతావరణంలోని నత్రజనిని రైజోబియం వేరుబుడిపెల ద్వారా స్థిరీకరించి భూసారాన్ని పెంచుతాయి. అంతేకాక అన్ని పప్పుధాన్యాల ఉత్పత్తికి దోహదపడి లభ్యత పెరిగి కొరతను తగ్గిస్తాయి. తోడుగా రైతుకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.

పత్తిపంటలో అంతర పంటగా సాగు చేస్తున్న కంది

ఒక పంట మరో పంట దిగుబడిని పెంచేలా..

నేల నుంచి పోషక పదార్థాలు, నీరు గ్రహించే లోతులో వ్యత్యాసం ఉండే వేర్ల నిర్మాణం కలిగిన పంటలను ఎన్నుకోవాలి. ఒక పంట మరో పంట దిగుబడిని పెంపొందించే విధంగా ఉండాలి. పోషక పదార్థాలు, నీరు, వెలుతురు విషయంలో పంటల మధ్య పోటీ ఉండకూడదు. వేర్వేరు కాలపరిమితులలో ఉన్న పంటలను, కలపడం వల్ల పోషక పదార్థాల అవశ్యకతలో తేడాలవల్ల, కీలక దశల్లో పోటీ ఉండకుండా ఆరోగ్యంగా పెంచవచ్చు. బహువార్షిక పంటలైన ఉద్యాన పంటలు తొలుత నాలుగైదేళ్ల వరకు చెట్ల మధ్య ఖాళీ ప్రదేశంలో పంటలు పండించవచ్చు. పంటల పెరుగుదలకు సంబంధించి పొడవు, పొట్టి వ్యత్యాసాలను బట్టి రెండు కంటే ఎక్కువ పంటలను వివిధ దశల్లో పండించవచ్చు. ఒక పంటపై పురుగులను తినే సహజ శత్రువులను పెంపొందించడానికి కూడా అంతర పంటలను పెంచవచ్చు. ప్రధాన పంటలను ఆశించే పురుగులను అంతర పంటపై ఆకర్షించి చీడపీడల బారి నుంచి ప్రధాన పంటను రక్షించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement