
విద్యలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థుల ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారుతుందని, ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు. సిద్దిపేట జిల్లాలో వివిధ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలను శుక్రవారం డీఈవో శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు తన సమస్యల పట్ల పోరాటం చేస్తూనే బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించాలనే తపన, విద్యార్థుల నిరంతర అభివృద్ధికి వారు చేసే కృషి అభినందనీయమన్నారు. విద్యాభివృద్ధితో పాటు సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులు బహుముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నాణ్యమైన విద్య అందివాలని, పిల్లల నమోదు పెంచాలని ప్రయత్నం చేస్తోందని, దానికి ప్రతి ఉపాధ్యాయుడు తన వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏకీకృత సర్వీసు నిబంధనల సాధనకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు రఘువర్ధన్‌రెడ్డి, తిరుపతి, శ్రీనాకర్ రెడ్డి, సింగోజి జనార్దన్, నర్సిరెడ్డి , బాలకిషన్, ఉమాశంకర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.