
యుద్ధం ఎందుకు ఆపారో మోదీ చెప్పాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: ట్రంప్ ట్విట్టర్‌తో యుద్ధాన్ని నిలిపివేసి దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మన సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడి చేస్తుంటే ఎలాంటి చర్చలు లేకుండా ఎందుకు ఆపారో ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం దేశమంతా ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేశ సరిహద్దుల్లో ఉన్న సైన్యానికి మద్దతుగా ర్యాలీలు చేపట్టామన్నారు. భారత ఆర్మీకి శాసన సభ్యులందరు నెల జీతం ఇచ్చారన్నారు. డామేజ్‌ని కంట్రోల్ చేసుకునేందుకే త్రివిధ దళాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రధాని దమ్మున్న వ్యక్తి అయితే యుద్దాన్ని ఎందుకు విరమించారో, జరిగిన నష్టమేమిటో పార్లమెంట్ వేదికగా చర్చకు పిలువాలని డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ ప్రకటన చేసిన నాలుగు గంటల్లోనే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే మీరు ఏమి చేశారని ప్రశ్నించారు. పహల్గామ్ పై చేసిన దాడి పాకిస్తాన్ చేసిందని ఎంఐఎం కూడా ముక్తకంఠంతో ఖండించిందన్నారు.