
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
న్యాల్‌కల్(జహీరాబాద్)/జహీరాబాద్ టౌన్: అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ స్పష్టం చేశారు. న్యాల్‌కల్‌లో ఇందిరమ్మ ఇళ్లను సోమవారం ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు జహీరాబాద్ మండలంలోని బూచినెల్లి గ్రామంలో బుద్ధ విహార్‌ను ప్రారంభించడంతోపాటుగా గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గౌతమ బుద్ధుడు చూపిన మార్గంలో నడుస్తూ మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. న్యాల్‌కల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ఎంపీ తెలిపారు. ఇళ్లు కట్టుకుంటున్న వారికి ఇటీవల రూ.1లక్ష చొప్పున అందించడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం రేజింతల్ గ్రామశివారులో గల శ్రీసిద్ధివినాయక ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి దైవదర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎంపీని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ బుద్దిష్టు సొసైటీ సభ్యులు దశరథ్, సుభాష్, బక్కప్ప, రాజ్‌కుమార్, నర్సింలు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ గౌడ్, సమతా సైనిక్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్, జిల్లా అధ్యక్షుడు కరణం రవికుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్