
అభ్యుదయ రైతుగా గుర్తింపు
కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన నాయిని లక్ష్మి, భర్త రామక్రిష్ణాగౌడ్, ఇద్దరు పిల్లలతోపాటు ఉమ్మడి కుటుంబం ఉంది. మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయ కుటుంబం కావడంతో భార్యాభర్తలు సాగు చేస్తున్నారు. కాగా లక్ష్మి భిన్నంగా ఆలోచించి సాంప్రదాయ సాగుకు ఆధునికత, కొత్తదనం జోడించింది. వరి పంటతోపాటు పంటమార్పు చేస్తూ కూరగాయలు, బంతిపూలు, కంది పంట సాగు చేసింది.
మినికిట్స్ సాగు
సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రాహుల్ విశ్వకర్మ, సంధ్య సూచనలతో వరి పంటలో 5 కిలోల ఫౌండేషన్ విత్తన మినికిట్స్ సాగు చేశారు. ఇందులో ఆర్‌ఎన్‌ఆర్ 21278, 31479, 15048 (షుగర్‌లెస్), కేఎన్‌ఎం 12368, డబ్ల్యూజీఎల్ 28369, ఆర్‌డీఆర్ 1260, కేఉపీఎస్ 625 రకం వరి పంటను సాగు చేసి వచ్చిన ధాన్యాన్ని తోటి రైతులకు విత్తనాలుగా అమ్మారు. దీనికితోడు వరిలో దేశివాలి రకం కుచ్ పటారియా, చిరూర్‌కి, చిట్టిముత్యాలు, కాలబత్తి(నల్లవడ్లు) సాగు చేశారు.
పంటమార్పు కోసం :
వరి పంటలో మార్పుకోసం కూరగాయలు టమాటా, వంకాయ, కాకరతోపాటు బంతిపూలు, కంది సాగు చేశారు. దీంతోపాటు పది గుంటల్లో తొమ్మిది రకాల కూరగాయల పంట ఇంటి అవసరాల కోసం సాగు చేశారు. కూరగాయలు, వరి పంటలో ఒక ఎకరం సేంద్రియ పద్ధతిలో సాగు చేసినట్లు తెలిపారు. మండలంలోని తునికి వద్ద గల కేవీకే శాస్త్రవేత్తలు ఆవును ఇవ్వగా వారి సూచనలతో ఆవును పెంచుతూ దాని పేడ, మూత్రంతో జీవాంమృతం, బీజాంమృతం ఎరువు తయారీ చీడపీడల నివారణకు వివిధ రకాల ఆకుల కషాయాలు తయారు చేసి వినియోగించింది.
ఆర్‌ఈఏసీ సభ్యురాలిగా లక్ష్మి ఎంపిక
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఆర్‌ఈఏసీ (రీసెర్చ్ అండ్ ఎక్సటెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్) సభ్యులుగా రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు రైతులను ఎంపిక చేయగా అందులో మహిళా రైతుగా నాయిని లక్ష్మిని ఎంపిక చేశారు. వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్య లక్ష్మిని అభినందించారు. రెండేళ్లపాటు సభ్యురాలిగా కొనసాగనుండగా సాగుపై సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆర్‌ఈఏసీ సమావేశంలో రైతులకు అందుబాటులో ఉండేలా నర్సాపూర్‌లో విత్తన గోదాం, టింబర్ గోదాం నిర్మించాలని సూచించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల సహకారంతో..
భర్త రామక్రిష్ణాగౌడ్‌తోపాటు కుంటుంబ సభ్యులు సహకారంతో సాగు చేస్తున్నా. సాగులో మినికిట్స్, పంట మార్పిడి, కూరగాయలు సాగు చేశా. ప్రస్తుతం వరి పంట కోత పూర్తికాగా కాకరకాయ, టమాటా, వంకాయ పంట ఉంది. దీంతోపాటు ఇంటి పంటగా పలు రకాల ఆకు కూరలు ఉన్నాయి. సాగులో గుర్తింపు వచ్చి ఆర్‌ఈఏసీ సభ్యురాలిగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది.
– నాయిని లక్ష్మి, ఆర్‌ఈఏసీ సభ్యురాలు
మినికిట్స్ సాగుతోపాటు పంట మార్పు చేసి సాగు చేయడంతో సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రేవేత్తలు డిసెంబర్ 2024లో పీజేటీఏయూ వజ్రోత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు అభ్యుదయ రైతులను ఎంపిక చేశారు. అందులో కంచన్‌పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు లక్ష్మి ఎంపికై ంది. దీంతో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ సహాయ సంచాలకు ఉమారెడ్డి ప్రశంసాపత్రం, మెమోంటో అందజేసి సన్మానించారు.

అభ్యుదయ రైతుగా గుర్తింపు

అభ్యుదయ రైతుగా గుర్తింపు