
వృద్ధుల పట్ల ప్రత్యేకశ్రద్ధ వహించాలి
జిల్లా న్యాయ సేవాధికారి
సంస్థ కార్యదర్శి సౌజన్య
పటాన్‌చెరు టౌన్: వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. అమీన్‌పూర్‌లోని ది నెస్ట్ వృద్ధాశ్రమాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...వృద్ధుల బాగోగులను మనమే చూసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. న్యాయపరమైన విషయంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ది నెస్ట్ ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాపై
అవగాహన కల్పించాలి
ఏఎస్పీ సంజీవరావు
సంగారెడ్డి : స్కూల్స్, కళాశాలలకు వేసవి సెలవులు వచ్చిన నేపథ్యంలో పిల్లలు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ ఎ.సంజీవరావ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొబైల్ ఫోన్లకు ప్రభావితమై సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో పరిచయాలేర్పడి పిల్లలు దారితప్పే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వారికి సోషల్ మీడియాపట్ల పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. వీలైతే పిల్లలకు కొత్త కొత్త నైపుణ్యాలను నేర్పించాలని కోరారు.
సమస్యలపై ప్రత్యేక దృష్టి
జెడ్పీ డిప్యూటీ సీఈఓ స్వప్న
కల్హేర్(నారాయణఖేడ్): సమస్యల పరిష్కారం పట్ల దృష్టి పెట్టాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ స్వప్న అధికారులను ఆదేశించారు. కల్హేర్ మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. ఎంపీడీఓలు రమేశ్‌బాబు, సంగ్రామ్, ఎంపీఓ శ్రీనివాస్, సిబ్బంది పరమేశం, షాకీర్, సాగర్ పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమానికి కృషి
సీఐటీయూ రాజయ్య
పటాన్‌చెరు టౌన్: ప్రజలు,కార్మిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మికవర్గంతోపాటు అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య పిలుపునిచ్చారు. మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో గల వాగ్వాల్స్, పటాన్‌చెరు పట్టణంలోని అస్సాం కార్బన్ పరిశ్రమలలో కార్మికుల జనరల్‌బాడీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య హాజరై మాట్లాడారు. ఈనెల 20 దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె విజయవంతానికి పరిశ్రమలు స్వచ్ఛందంగా బంద్‌పాటించాలని కోరారు. కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్వర్, రాజేశ్వర్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
రూ.18 లక్షల పరిహారం అందజేత
పటాన్‌చెరు పట్టణంలోని అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో కొన్నిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ కార్మికునికి నష్టపరిహారం కింద పరిశ్రమ యాజమాన్యం ఇచ్చిన రూ.18 లక్షల డీడీని రాజయ్య కార్మికుడి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ...కార్మికులు ప్రమాదాలు జరిగినప్పుడు యజమానులు మానవీయ దృక్పథంతో ఆలోచించి కార్మికుల ను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమ యజమాన్యం కార్మిక కుటుంబాన్ని ఆదుకోవడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు.

వృద్ధుల పట్ల ప్రత్యేకశ్రద్ధ వహించాలి

వృద్ధుల పట్ల ప్రత్యేకశ్రద్ధ వహించాలి