
ఉపాధి పని వేళల్లో మార్పు
సంగారెడ్డి జోన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే వేసవి నేపథ్యంలో ఎండలు దంచికొడుతుండటంతో కూలీలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వారి పనివేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కూలీలకు ఉపశమనం కలగనుంది.
ఉదయం 6 నుంచి
మధ్యాహ్నం 12 గంటల వరకే...
వేసవి కాలంలో ఎండ తీవ్రత, వడదెబ్బ సమస్యలు పెరిగే అవకాశం ఉండటంతో, ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఉపా ధి పనులు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పనులు చేసుకునే విధంగా సౌకర్యం కల్పించింది. ఉపాధిలో రోజు కూలి రూ. 307లను నిర్దేశించింది. కేవలం ఉదయం సమయంలో పనులు ఉండటంతో మండే ఎండలకు ఉక్కపోతకు గురై పూర్తిస్థాయిలో పనులు చేసేవారు కాదు. దీంతో దినసరి కూలి తక్కువగా వచ్చేది. ఉపాధి హామీ కూలీలకు సంబంధిత అధికారులు వేసవిలో ఎండలు అధికమవుతున్న తరుణంలో రక్షణ పొందుతూ పనులు చేసుకోవాలని, అవసరమైతే సాయంత్రం సమయంలో పనులు చేసుకునే సౌకర్యం కల్పించిందని అవగాహన కల్పిస్తున్నారు.
పెరుగుతున్న కూలీలు
గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీలో పనివేళల్లో వెసులుబాటులో కల్పించడంతో రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 36 వేలకు పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలలోని పని ప్రదేశాలు కూలీలతో సందడిగా కనిపిస్తోంది. ఉపాధి హామీలో ప్రస్తుత 2025–26 ఆర్థిక ఏడాదిలో 39.96లక్షల పని దినాలు కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించి, పనులు సాగిస్తున్నారు. జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికి పనులు కల్పిస్తారు. పనుల వేళల్లో మార్పులు తీసుకురావడంతో తమకు పూర్తిస్థాయిలో కూలి అందుతుందని కూలీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహణ
నిర్దేశిత కూలి అందించేందుకు చర్యలు
పెరుగుతున్న ఎండల దృష్ట్యా మార్పులు
కూలీలకు ఇబ్బందులుకలగకుండా చర్యలు
సద్వినియోగం చేసుకోవాలి
ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం తీసుకు వచ్చిన వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలి. మండుతున్న ఎండల దృష్ట్యా ప్రతీ కూలికి నిర్దేశించిన డబ్బులు అందేవిధంగా పనులు చేపట్టేందుకు వీలు కల్పించింది. అర్హులైన ప్రతీ ఒక్కరికి పనులు కల్పిస్తాం.
– జ్యోతి, డీఆర్డీఓ, సంగారెడ్డి

ఉపాధి పని వేళల్లో మార్పు