
రెండు ద్విచక్రవాహనాలు ఢీ
● లిఫ్టు అడిగి వెనుక కూర్చున్న వ్యక్తి మృతి
● ముగ్గురికి తీవ్ర గాయాలు
నారాయణఖేడ్ : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మరణించగా ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన నారాయణఖేడ్ మండలం నాగాపూర్ గ్రామం వద్ద గురువారం చోటు చేసుకుంది. ఖేడ్ ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి వివరాల ప్రకారం.. సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన సురేష్ ఖేడ్ మండలం అబ్బెంద క్లస్టర్ ఏఈఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నాగాపూర్ గ్రామంలో తన విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై నాగాపూర్ తండాకు చెందిన బిక్యానాయక్‌తో కలిసి ఖేడ్‌కు వస్తున్నాడు. కంగ్టి వైపు నుంచి ఖేడ్ మండలం సీతారాంతండాకు చెందిన కాశీరాం తన కుమారుడైన చందుతో కలిసి ద్విచక్రవాహనంపై ఖేడ్ వైపు వస్తున్నారు. నాగాపూర్ దాటాక సురేష్ ద్విచక్రవాహనాన్ని కాశీరాం వెనుకనుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లగా బిక్యానాయక్(65) అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడ్డ సురేష్(35), కాశీరాం(35), చందు (5)లను మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
లిఫ్ట్ అడిగి ప్రాణాలు కోల్పోయి..
నాగాపూర్ నుంచి ద్విచక్రవాహనంపై ఖేడ్‌కు వస్తున్న ఏఈఓ సురేష్‌ను బిక్యానాయక్ లిఫ్టు అడిగి అతడి వాహనంపై వెనుకకూర్చుని వస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. బిక్యానాయక్‌కు భార్య అనిశాబాయితోపాటు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. కాగా కూతుళ్ల వివాహాలు జరిగాయి. అతడి మృతితో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.

రెండు ద్విచక్రవాహనాలు ఢీ