
రుణాల మంజూరులో తెరపైకి సిబిల్ స్కోర్
ప్రత్యేక డీసీసీ సమావేశంలో చర్చ
రుణాల మంజూరులో తెరపైకి సిబిల్ స్కోర్
మానవీయ కోణంలో రుణాలివ్వాలంటున్న అధికారులు
మార్గదర్శకాలు పాటిస్తాం: బ్యాంకర్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాజీవ్ యువ వికాసం పథకం అమలులో సిబిల్ స్కోర్ అంశం తెరపైకి వస్తోంది. ఈ పథకం కింద ఇచ్చే రుణాల మంజూరు విషయంలో లబ్ధిదారుల సిబిల్ స్కొర్‌ను పరిగణలోకి తీసుకుంటే చాలామంది దరఖాస్తుదారులకు ఈ పథకం యూనిట్లు మంజూరయ్యే అవకాశాలు ఉండటం లేదు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా నిరుపేదలే. దీంతో బ్యాంకులు సిబిల్ స్కోర్ కారణంగా ఈ రుణాలు దక్కక ఈ పథకం ద్వారా లబ్ధిపొందడం ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ రుణాల మంజూరులో బ్యాంకర్లు మానవీయ కోణంలో వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.
కొనసాగుతున్న పరిశీలన ప్రక్రియ
ఈ పథకం కోసం జిల్లాలోని యువత నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కేటగిరీల కింద మొత్తం 49,559 దరఖాస్తులు వచ్చాయి. ఎంపీ డీఓలు ఆయా మండలాల స్థాయిలో దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పరిశీలించి అర్హులైన వారి దరఖాస్తులను సంబంధిత బ్యాంకులకు ఫార్వర్డ్ చేస్తారు. ఇలా ఆయా బ్యాంకులకు వచ్చిన దరఖాస్తుదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. రుణం మంజూరులో సిబిల్ స్కోర్ కీలకంగా మారుతుంది.
ఆ యూనిట్లకు బ్యాంకు రుణాలు...
ఈ పథకం కింద రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వ్యయం ఉన్న యూనిట్లకు బ్యాంకులు 30% మొత్తాన్ని రుణంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వ్యయం ఉన్న యూనిట్లకు రూ.20 శాతం మొత్తాన్ని, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు యూనిట్ కాస్ట్ ఉన్న లబ్ధిదారులకు బ్యాంకులు పది శాతం రుణం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రుణం ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ పాటించడం తప్పనిసరని బ్యాంకు మేనేజర్లు పేర్కొంటున్నారు.
మానవీయ కోణంలో రుణాలివ్వాలి
రాజీవ్‌యువ వికాసం పథకం కింద ఇచ్చే రుణాల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని బ్యాంకర్లకు చెబుతున్నాము. ఈ పథకం కింద రుణాలు పొందే వారంతా నిరుపేదలే ఉంటారు. వారికి చేయూతనందిస్తే వారు స్వయం ఉపాధి పొందేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
–రామాచారి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ
ఎస్‌ఎల్‌బీసీ లేఖ రాస్తాం
వివిధ రకాల రుణ మంజూరులో బ్యాంకులు తప్పనిసరిగా రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ పాటించాల్సి ఉంటుంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఇచ్చే రుణాలకు సంబంధించి సిబిల్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకోవద్దనే గైడ్‌లైన్స్ ఏమీ మాకు రాలేదు. ఈ విషయంలో ఎస్‌ఎల్‌బీసీకి రాసి స్పష్టత తీసుకుంటాము.
–బి.నర్సింగ్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్, సంగారెడ్డి
డీసీసీ సమావేశంలో చర్చ
ఈ పథకాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు ఇటీవల జిల్లా కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకుల ప్రతినిధులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్‌లకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. లబ్ధిదారులకు వీలైనంత త్వరగా రుణాలు మంజూరు చేయాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా ఈ సిబిల్ స్కోర్ అంశంపై ప్రత్యేకంగా చర్చ జరిగింది.