
రెగ్యులర్ ఈవో కలేనా!
ఇన్‌చార్జీలతోనే ఏడుపాయల ఆలయం
● ఇటీవల రంగారెడ్డి జిల్లాకు ఇన్‌చార్జి ఈవో చంద్రశేఖర్ బదిలీ
● అయినా తప్పని ఉమ్మడి మెదక్ జిల్లా అదనపు బాధ్యతలు
● తలకు మించిన భారంతో సతమతం
● రెగ్యులర్ ఈవో లేక భక్తులకు వసతులు కరువు
పాపన్నపేట(మెదక్): తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల ఆలయానికి రెగ్యులర్ ఈవో నియా మకం కలగానే మిగిలిపోతుంది. మెదక్ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్, ఏడుపాయల ఇన్‌చార్జి ఈవో చంద్రశేఖర్‌ను నాలుగు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో రెండు జిల్లాల అదనపు కమిషనర్‌గా.. ఏడుపాయల ఇన్‌చార్జి ఈవోగా బహుముఖ బాధ్యతలు నిర్వహించలేక.. తలకు మించిన భారంతో సతమత మవుతున్నారు. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయలకు రెగ్యులర్ ఈవో లేక భక్తులు అవస్థల పాలవుతున్నారు.
రెండు జిల్లాల ఆలయాల బాధ్యతలు
మెదక్ ఉమ్మడి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న చంద్రశేఖర్ రెండేళ్ల కిందట ఏడుపాయల ఇన్‌చార్జి ఈవోగా బదిలీ అయ్యారు. అప్పటి నుంచి రెండు బాధ్యతలు చూస్తూ వస్తున్నారు. నాలుగు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇక్కడి నుంచి బదిలీ అయినా పాత పోస్టులు కూడా అలానే ఉంచడంతో పని భారం ఎక్కువైంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట మూడు జిల్లాల్లో కలిసి గుర్తింపు పొందిన 36 పెద్ద దేవాలయాలతోపాటు, చిన్నాచితక సుమారు 3 వేల ఆలయాలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 6 వేల దేవాలయాల వరకు ఉంటాయని తెలుస్తుంది. వీటన్నింటికీ అసిస్టెంట్ కమిషనర్‌గా చంద్రశేఖర్ బాధ్యతలు నిర్వర్తించాలంటే తలకు మించిన భారమే అవుతుంది.
రూ.లక్షల్లో ఆదాయం ఉన్నా..
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఏడుపాయల. 6ఏ టెంపుల్‌గా గుర్తింపు పొందిన వన దుర్గమ్మ ఆలయం దర్శించుకోవడానికి యేటా సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారు. సుమారు రూ.15 కోట్ల ఆదాయం ఉంటుంది. ఆది, మంగళ, శుక్ర వారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి జాతరకు సుమారు 12 లక్షల భక్తులు వస్తారు. ఇంతటి ప్రాధాన్యత గల దేవాలయానికి రెగ్యులర్ ఈవో లేకపోవడం దురదృష్టకరమని భక్తులు వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కరించే నాథుడే లేడని అంటున్నారు.
ఏళ్ల కొద్దీ ఇన్‌చార్జీలతో పాలన
2023లో ఈవో సార శ్రీనివాస్ బదిలీ అయిన తర్వాత మోహన్ రెడ్డి వచ్చారు. ఆయన రిటైర్‌మెంట్ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ వినోద్ రెడ్డి, క్రిష్ణ ప్రసాద్ వచ్చారు. అప్పట్లో నెల లోపు ముగ్గురు ఈవోలు మారారు. అనంతరం వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఇన్‌చార్జి ఈవోగా కొనసాగుతూ ఇటీవల రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. అయినా ఆయనకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పారు. బహుముఖ విధులు నిర్వరిస్తున్న ఆయన ఏడుపాయలకు పూర్తిగా న్యాయం చేయలేక పోతున్నారని భక్తులు వాపోతున్నారు. గతంలో ఎంతో మంది గ్రేడ్–2 ఈవోలు ఏడుపాయల ఈవోలుగా పని చేశారు. ఈ క్రమంలో గ్రేడ్–2 స్థాయి ఈవోనైనా నియమించి తమ ఇబ్బందులు తీర్చి ఏడుపాయల అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నారు.

రెగ్యులర్ ఈవో కలేనా!