
వివాహితను కాపాడిన షీ టీమ్ బృందం
అత్తింటి వేధింపులతో ఆత్మహత్యాయత్నం
నర్సాపూర్ రూరల్: చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్న వివాహితను షీ టీమ్ బృందం సభ్యులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల జ్యోతి కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక సోమవారం నర్సాపూర్ రాయ రావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు బయలుదేరింది. చెరువు ప్రాంతంలో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న షీ టీమ్ బృందం సభ్యులు దేవదాస్, స్వామి సకాలంలో స్పందించారు. వెంటనే వెళ్లి జ్యోతిని కాపాడి నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. జ్యోతి భర్త లింగం, అత్త, మరిదితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా వేధింపులకు గురి చేస్తున్నారని పలుమార్లు పంచాయితీ పెట్టినా మారకపోవడంతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఏడేళ్ల కిందట పిచ్చకుంట్ల గ్రామానికి చెందిన లింగంతో వివాహం జరిగిందని, ప్రస్తుతం ఇద్దరు కుమారులు కూడా ఉన్నట్లు చెప్పింది. తల్లిదండ్రులు నర్సాపూర్ లో నివాసం ఉంటారని పేర్కొంది.