
ప్రతి రైతుకూ గుర్తింపు కార్డు
● జిల్లాలో నేటి నుంచి ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ● 40 రోజుల పాటు ఆన్‌లైన్‌లో నమోదు ● 3.26 లక్షల అన్నదాతలకు కార్డులు ● పైలెట్ ప్రాజెక్టు కిందమొగుడంపల్లి గ్రామం ఎంపిక ● ప్రత్యేక యాప్ ద్వారా నమోదు ప్రక్రియ
కేంద్రం ఇచ్చే పథకాలకు ఇదే ఆధారం
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఫార్మర్ రిజిస్ట్రీపైనే ఆధారపడి ఉంటాయి. వ్యవసాయ సంబంధిత పరికరాలను అందజేయడం, పీఎం కిసాన్ తదితర పథకాలకు సాగుదారుల సంఖ్య ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రతి పనికి ఈ కార్డు తీసుకెళితే సరిపోతుంది. ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాలకు ఎంపిక చేసిన ప్రాంతాలకు జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హాజరవుతారు. రైతులకు సలహాలు, సూచనలు అందజేసి పంటల సాగు, దిగుబడులు సాధించడంపై అవగాహన కల్పిస్తారు. ఏఈఓలు ప్రత్యేక యాప్ ద్వారా రైతుల పేర్లు నమోదు చేస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైతుల నుంచి వివరాలు తీసుకుంటారు. లేని వారి వివరాలు తర్వాత సేకరిస్తాం.
– శివప్రసాద్,వ్యవసాయ శాఖ అధికారి,
సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్: నేటి నుంచి జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతుకు 11 అంకెల కార్డును కేటాయించనున్నారు. ఏప్రిల్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద మొగుడంపల్లి రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేసి రైతుల పేర్లను నమోదు చేశారు. మొగుడంపల్లితో పాటు 9 తండాలను చేర్చారు. 4,123 మంది రైతులు ఉండగా, ఇందులో 1,100 మంది రైతుల పేర్లు నమోదు చేశారు. సోమవారం నుంచి నమోదు ప్రక్రియను జూన్ 13వ తేదీ వరకు కొనసాగించనున్నారు. రైతు వేదికల్లో ఏఈఓలు ప్రత్యేక యాప్ ద్వారా రైతుల పేర్లను నమోదు చేస్తారు. రైతు వేదికలు లేని చోట గ్రామ పంచాయతీ భవనాలు, మున్సిపాలిటీల్లోని వార్డు కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి షెడ్యూల్ ప్రకారం ఏఈఓలు వెళ్లి నమోదు చేపడతారు. జిల్లాలో 7.50 లక్షల ఎకరాల నికర సాగు భూమి ఉండగా, 3.26 లక్షల మంది రైతులున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు.
ప్రత్యేక యాప్ ద్వారా నమోదు
రైతుల వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక యాప్ ద్వారా ఆధార్ కార్డు మాదిరిగా ఉండాలనే ఉద్దేశంతో సాగుదారుల సంఖ్యను ఇవ్వనున్నారు. పీఎం కిసాన్, క్రాప్ లోన్, పంటల బీమా, యాంత్రీకరణ పరికరాలతో పాటు తదితర పథకాలను సాగుదారుల సంఖ్య ఆధారంగా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు అందే పథకాలు అమలు చేసేందుకు ఇది ఉపయోగపడనుంది. బ్యాంకు రుణాల కోసం సాగుదారుల సంఖ్య కార్డును తీసుకెళితే సరిపోతుంది. ధాన్యం కొనుగోళ్లకు సైతం ఇదే కార్డును వర్తింపజేయనున్నారు.
తగిన సమాచారంతో నమోదుకు వెళ్లాలి
సాగుదారుల సంఖ్య కార్డు నమోదుకు తగిన సమాచారంతో వెళ్లాలి. నమోదు కేంద్రానికి ఆధార్‌కార్డు లింకు ఉన్న ఫోన్ నంబర్, ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం తీసుకెళ్లాలి. వ్యవసాయ సిబ్బంది ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తారు. అనంతరం రైతు సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీని సిబ్బందికి చెబితే 11 అంకెల ప్రత్యేక గుర్తింపుకార్డు సంఖ్యను కేటాయిస్తారు.