
కాంగ్రెస్‌లో ‘మార్కెట్’ రగడ
● ఎటూ తేలని ఖేడ్, పటాన్‌చెరుఏఎంసీల పాలకవర్గాలు నియామకం ● నేతల మధ్య ఆధిపత్య పోరుకారణమంటున్న పార్టీ వర్గాలు ● పీసీసీ వద్దకు పటాన్‌చెరు‘మార్కెట్’ పంచాయితీ ● ఎంపీ, ఎమ్మెల్యేలు చర్చించుకుంటేనే ‘ఖేడ్’ కమిటీపై స్పష్టత ● సర్కారు వచ్చి 16 నెలలైనాతేలని పంచాయితీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అధికార కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ కమిటీల పాలకవర్గాల రగడ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకాలు జరిగినప్పటికీ నారాయణఖేడ్, పటాన్‌చెరు మార్కెట్ కమిటీల పాలకవర్గం ఖరారు కావడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఈ పాలకవర్గాలు ఎటూ తేలడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో మొత్తం ఎనిమిది మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, వట్‌పల్లి, జోగిపేట, రాయ్‌కోడ్ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు నియామకం జరిగి ఆరు నెలలు గడుస్తోంది. కానీ, నారాయణఖేడ్, పటాన్‌చెరు కమిటీల పంచాయితీ మాత్రం ఎటూ తేలడం లేదు.
గూడెం ప్రతిపాదించి రెండు నెలలైనా..
పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యుల పదవులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కొందరు నాయకుల పేర్లను ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రతిపాదిత లేఖను ఫిబ్రవరిలోనే అధికారులకు అందజేశారు. ఆ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న కా టా శ్రీనివాస్‌గౌడ్ అభ్యంతరం తెలపడంతో గూడెం ప్రతిపాదనలకు బ్రేక్ పడింది. రెండు నెలలుగా ఈ పంచాయితీ ఎటూ తేలడం లేదు. ఈ చైర్మన్, సభ్యుల పదవులను తన వర్గీయులకు ఇచ్చేందుకు గూడెం మహిపాల్‌రెడ్డి ప్రతిపాదించగా, కాటా శ్రీనివాస్‌గౌడ్ తన అనుచరులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గత ఆరు నెలలుగా ఈ పదవులు భర్తీ కావడం లేదు.
పీసీసీకి మార్కెట్ కమిటీ పంచాయితీ
పటాన్‌చెరు మార్కెట్ కమిటీ నియామకాల క్లిష్టంగా మారడంతో ఈ పంచాయితీ పీసీసీ వద్దకు వెళ్లింది. ముఖ్యనేతలే ఈ పంచాయితీని తేల్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే ఆరు నెలలుగా ఈ పదవులు భర్తీ కావడం లేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
‘ఖేడ్’లో సమన్వయం కుదిరితేనే..
నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవులను కూడా తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు అక్కడి ఇద్దరు నేతలు పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తన అనుచరులకు ఈ పదవిని ఇప్పించుకునేందుకు ప్రయత్నించగా, స్థానికంగా ఉండే జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కార్ కూడా తన వర్గీయులకు ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతో ఈ మార్కెట్ పంచాయితీ కూడా ఇంకా ఎటూ తేలడం లేదు. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కుదిరితేనే ఈ పదవులు తేలే అవకాశాలు ఉన్నట్లు హస్తం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
గతంలో జహీరాబాద్‌లోనూ లొల్లే..
జహీరాబాద్ మార్కెట్ కమిటీ నియామకం గతంలోనే పూర్తయిన విషయం విదితమే. ఈ కమిటీ చైర్మన్ పదవిని అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్ తన కుమారుడిని నియమించుకున్నారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నేతలు అప్పట్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న తమకు ప్రభుత్వం వచ్చాక పదవులు దక్కుతాయనుకుంటే తమకు నిరాశే ఎదురైందని స్థానిక సీనియర్ నాయ కులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఒక టర్మే దగ్గర పడుతుండే...
ఆయా నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవుల్లో ఈ మార్కెట్ చైర్మన్లు, సభ్యుల పోస్టులు ముఖ్యమైనవి. సాధారణంగా ఈ పోస్టుల పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి 16 నెలలు గడుస్తోంది. కానీ ఇప్పటి వరకు నారాయణఖేడ్, పటాన్‌చెరు మార్కెట్ కమిటీల పోస్టులు ఎటూ తేలకపోవడంతో ఆ పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే ఈ పదవులను నియమించి ఉంటే ఒక టర్మే దగ్గర పడేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.