
రథశిఖర సామగ్రి పూజలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
జోగిపేట(అందోల్): జోగిపేటలోని జోగినాథ స్వామి జాతర ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షలు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు. మంగళవారం జాతర ఉత్సవాల్లో భాగంగా రథశిఖర స్థాపనకు సంబంధించిన పూజ కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆలయ పూజారీ భద్రప్ప, సుజిత్‌ల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర ఉత్సవాలను గతేడాది కంటే ఇప్పుడు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయించానని తెలిపారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని రథోత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. జాతరకు మంజూరైన నిధుల మంజూరు పత్రాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు.
రథశిఖర స్థాపన
జోగినాథ రథోత్సవాల్లో భాగంగా మంగళవారం రథశిఖర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రథంపై ఏర్పాటు చేసే ఇత్తడితో తయారు చేసిన గుండ్లు, త్రిశూలం, చక్రం వంటి వస్తువులను భక్తులు ఊరేగింపుగా గౌని వరకు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పి.శివశేఖర్, మున్సిపల్ కౌన్సిలర్లు ఎస్.సురేందర్‌గౌడ్, రంగ సురేశ్, డి.శివశంకర్, మాజీ ఏఎంసీ చైర్మన్లు మల్లికార్జున్, డీబీ.నాగభూషణం, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు రామాగౌడ్, నాయకులు చాపల వెంకటేశం, కమిటీ సభ్యులు తుపాకుల సునిల్, నర్రా నగేష్ పాల్గొన్నారు.