
విజయోత్సవ ర్యాలీలో రాములు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమలో మంగళవారం జరిగిన యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ కార్మిక రక్షణ సమితి అభ్యర్థి హుగ్గెల్లి రాములు 278 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. పరిశ్రమలో మొత్తం 1,687 పర్మినెంట్ కార్మికుల ఓట్లు ఉండగా.. వీటిలో 1,676 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ కార్మిక రక్షణ సమితి(టీకేఆర్‌ఎస్)కు 691, కార్మిక పోరాట సమితి(కేపీఎస్)కు 413, సీఐటీయూకు 298, బీఎంఎస్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీకేఆర్‌ఎస్ అభ్యర్థి హుగ్గెల్లి రాములు కేపీఎస్‌పై 278 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో కార్మికులు పరిశ్రమ ఎదుట బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సోమవారం సంగారెడ్డి పర్యటనకు వచ్చిన ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, చివరి రోజు హుగ్గెల్లి రాములుకు తమ మద్దతును ప్రకటించి గెలిపించాలని కార్మికులకు సూచించారు. దీంతో రాములు గెలుపు నల్లేరు మీద నడకలా సీను మారిపోవడం గమనార్హం! ఈ సందర్భంగా హుగ్గెల్లి రాములు ఓట్లేసి గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. కార్మికులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందుబాటులో ఉంటూ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు చింతా సాయినాథ్, యూనియన్ నాయకులు తిరుపతి రెడ్డి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.