కృత్రిమ రక్తం | Japan artificial blood raises hope for global medical | Sakshi
Sakshi News home page

కృత్రిమ రక్తం

Jun 2 2025 2:49 AM | Updated on Jun 2 2025 2:49 AM

Japan artificial blood raises hope for global medical

ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులో 

మామూలు రక్తం కంటే ఎక్కువ రోజులు నిల్వ 

బ్లడ్‌ గ్రూప్‌తో సంబంధం లేదు 

జపాన్‌ పరిశోధకుల క్లినికల్‌ ట్రయల్స్‌ 

పాడైపోయిన రక్తం నుంచే తయారీ 

2030 నాటికి అందుబాటులోకి

రక్తం ప్రాణాధారం. ఏదైనా ప్రమాదం జరిగి లేదా శస్త్రచికిత్స వల్ల చాలా రక్తం పోయిన మనిషిని బతికించాలంటే ఆసుపత్రిలో ఆ వ్యక్తి బ్లడ్‌ గ్రూప్‌నకు సరిపోయే రక్తం ఉండాలి. ఒకవేళ లేకపోతే సరిపోయే బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న ఆరోగ్యవంతుడైన మనిషి నుంచి రక్తాన్ని సేకరించి ఎక్కించాలి. ఆ రక్తం దొరక్క కొన్నిసార్లు ప్రాణాలే పోతుంటాయి. కానీ భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నివారించవచ్చు! ఎవరికైనా నిమిషాల్లో.. మనుషులే ఇవ్వాల్సిన అవసరం లేకుండా 24 గంటలూ రక్తం అందుబాటులో ఉండొచ్చు!! దీన్ని కృత్రిమ రక్తం అందామా లేక కృత్రిమ ప్రాణాధారం అందామా? ఏ పేరు పెట్టి పిలిచినా ఇదీ రక్తమే. ఈ దిశగా జపాన్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. అవి విజయవంతమైతే కోట్లాది మంది ప్రాణాలు కాపాడొచ్చు.

ప్రపంచంలోనే తొలిసారి 2018లో కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఎస్టిమేషన్‌ ఆఫ్‌ బ్లడ్‌ రిక్వైర్‌మెంట్‌ ఇన్‌ ఇండియా అనే నివేదిక విడుదల చేసింది. దేశంలో పెరుగుతున్న జనాభా, వారి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా దేశంలో రక్తమార్పిడుల వంటి వాటికి ఎంత రక్తం అవసరం అవుతుందో కనిపెట్టడం దీని ప్రధాన ఉద్దేశం. 2008 నాటి ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2007లో మన దేశంలో కోటి యూనిట్ల రక్తం కావాలని అంచనా వేసింది. కానీ, అప్పటికి మనదేశంలో అందుబాటులో ఉన్నది 40 లక్షల యూనిట్లే. 2018 లెక్కల ప్రకారం అవసరమైనది 2.65 కోట్ల యూనిట్లు. ఈ లెక్కన ప్రస్తుతం ఇది ఎంతకు చేరి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్క మనకే కాదు.. యావత్‌ ప్రపంచానికి కృత్రిమ రక్తం.. నిజంగా ప్రాణదాత.

రక్తమార్పిడి చరిత్ర 
మొట్టమొదటి రక్తమార్పిడి 1665లో ఇంగ్లండ్‌లో జరిగింది. కొన్ని కుక్కల నుంచి రక్తాన్ని తీసి గాయపడిన కుక్కకు ఎక్కించి దాని ప్రాణాలు కాపాడారు. ఆ తరువాత 1818లో బ్రిటిష్‌ వైద్యుడు జేమ్స్‌ బ్లండెల్‌ మనుషుల్లో రక్తమార్పిడి విజయవంతంగా నిర్వహించారు. 19వ శతాబ్దంలో న్యూయార్క్‌లో థియోడర్‌ గెయిలార్డ్‌ థామస్‌ అనే స్త్రీల వైద్య నిపుణుడు (గైనకాలజిస్ట్‌) రక్తానికి బదులు ఆవు పాలను వాడాడు. 1875లో.. తన దగ్గరకు తీవ్ర రక్తస్రావంతో వచ్చిన మహిళకు 175 మిల్లీలీటర్ల ఆవుపాలు ఎక్కించాడు.

వారంపాటు ఆమె జ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలతో ఇబ్బందిపడినా తరువాత అన్నీ సర్దుకున్నాయట. అలా థామస్‌ ఏడుసార్లు పాలు ఎక్కించాడట. ఆ ఫలితాలు ఎన్నో మెడికల్‌ జర్నళ్లలోనూ ప్రచురితమయ్యాయి. 1880 వరకు ఇలా రక్తానికి బదులు ఆవు, మేకపాలు ఎక్కించడం అమెరికా అంతటా జరిగిందని సైన్స్‌ మ్యాగజైన్‌ రాసింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ జపాన్‌తోపాటు అమెరికా, యూకే, చైనా వంటి దేశాలు కృత్రిమ రక్తంపై ఇప్పటికే చాలా పరిశోధనలు, ప్రయోగాలు చేశాయి.. చేస్తున్నాయి.  

పాడైపోయిన మానవ రక్తంతో.. 
మానవ రక్తానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ రక్తాన్ని జపాన్‌ పరిశోధకులు ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. జపాన్‌లోని నారా మెడికల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ హిరోమీ సకాయి ఇందులో కీలకపాత్ర పోషించారు. ఆమె, ఆమె వైద్య బృందం సాధించిన ఈ ఘనతను వైద్య చరిత్రను మలుపుతిప్పే ఘటనగా నిపుణులు వరి్ణస్తున్నారు. ఈ ప్రక్రియకు వీళ్లు వాడింది.. పాడైపోయిన మానవ రక్తాన్నే. ఈ రక్తంలోని హిమోగ్లోబిన్‌ను వీళ్లు వేరుచేశారు. దాన్ని ఎలాంటి వైరస్‌లూ సోకేందుకు అవకాశం లేని ప్రత్యేక షెల్‌లో ఉంచి, అత్యంత జాగ్రత్తగా, కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా ఈ కృత్రిమ రక్తం తయారుచేశారు.

ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. వాలంటీర్లకు 100 నుంచి 400 మిల్లీలీటర్ల కృత్రిమ రక్తాన్ని ఎక్కించి పరీక్షిస్తున్నారు. ఈ ఆవిష్కరణకు మద్దతుగా జరుగుతున్న మరో ఆవిష్కరణలో భాగంగా ప్రాణవాయువును తీసుకెళ్లేందుకు వాహకాలను తయారుచేస్తున్నారు. చువో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ తెరియుకి కొమట్సు బృందం. ప్లాస్మాలోని అల్బుమిన్‌తో వీటిని రూపొందించారు. ఇవి రక్తపోటును నియంత్రించేందుకు, గుండెపోటు వంటివి రాకుండా చేసేందుకు సహాయపడతాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే 2030 నాటికి ఈ రక్తం అందుబాటులోకి వస్తుంది.  

రక్తం ఎప్పుడు కావాలంటే..  
ఎముకల లోపల ఉండే మూలుగ నుంచి రక్తం తయారవుతుంది. సగటున మనిషి శరీరంలో దాదాపు 5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణం మన రక్తంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్‌ అనే పిగ్మెంట్‌. కొన్ని రకాల శస్త్రచికి త్సలు, ప్రమాదాలు, ప్రసవాలు, పోషకాహార లోపం వల్ల వచ్చే రక్తహీనత, బోన్‌ మేరో మార్పిడి, బోన్‌ మేరో ఫెయిల్యూర్, లుకేమియా, హీమోఫీలియా, డెంగ్యూ జ్వరం, తీవ్రమైన మలేరియా జ్వరం వంటి సందర్భాల్లో రక్తమార్పిడి అవసరమవుతుంది.

2 ఏళ్లు.. ఊదా రంగు..  
సాధారణంగా మన రక్తం 42 రోజుల వరకే నిల్వ ఉంటుంది. ఆలోపు వాడకపోతే వృథా అయిపోతుంది. కానీ ఈ కృత్రిమ రక్తం 2 ఏళ్లపాటు నిల్వ ఉంటుంది. అంటే.. వృథా అయ్యే అవకాశమే లేదన్నమాట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మనరక్తం ఎరుపు రంగులో ఉంటే ఇది ఊదా రంగులో ఉంటుంది. అలవాటు కావడానికి మనకు కాస్త సమయం పడుతుందేమో! అంతేకాదు, బ్లడ్‌ గ్రూప్‌తో సంబంధం లేకుండా అందరికీ ఈ రక్తాన్ని ఎక్కించే అవకాశం కూడా ఉందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement