
స్కూల్ పిల్లలకు తప్పిన ముప్పు
మొయినాబాద్: డ్రైవర్ నిర్లక్ష్యంతో స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన నాగిరెడ్డిగూడలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్ బస్సు బాకారం నుంచి పిల్లలను ఎక్కించుకుని నాగిరెడ్డిగూడ వెళ్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఒకవైపు చక్రాలు పంటపొలంలోకి దూసుకెళ్లడంతో బస్సు ఆగిపోయింది. ఈ సమయంలో బస్సులో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతోనే రోడ్డు కిందికి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు మండిపడ్డారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. స్కూల్ బస్సులు వరుస ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో వీటి ఫిట్‌నెస్‌పై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.