హయత్‌నగర్: కేంద్ర ప్రభుత్వ కర్షక, కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి, కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కారు తీరుకు నిరసనగా ఈ నెల 9న తలపెట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ మండల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం కుంట్లూరులోని రావినారాయణరెడ్డి కాలనీలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఫిక్స్‌డ్ టర్మ్, అప్రెంటీస్, థర్డ్ పార్టీ ట్రైనీలుగా పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించాలని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు హరిసింగ్‌నాయక్, నాయకులు లక్ష్మణ్, నర్సింహ, ప్రసాద్, నవనీత తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రవీంద్రాచారి