
తెల్లచందనం స్మగ్లర్ల అరెస్ట్
చేవెళ్ల: పుష్ప సినిమా తరహాలో.. అక్రమంగా తరలిస్తున్న టన్ను (1,000 కిలోల) తెల్లచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం చేవెళ్ల ఏసీపీ బి.కిషన్ వెల్లడించారు. మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చేవెళ్ల పోలీసులతో కలిసి మంగళవారం మండలంలోని బస్తేపూర్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎంహెచ్ 25 ఏజే 3689 నంబరు కలిగిన డీసీఎం వ్యాన్‌ను తనిఖీ చేశారు. వ్యాన్ బాడీ మొత్తం ఖాళీగా ఉండగా.. డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు డ్రైవర్ వెనక భాగంలో ప్రత్యేకంగా ఓ చిన్నపాటి అరను తయారు చేయించినట్లు గమనించారు. దీన్ని తెరిపించి చూడగా ప్లాస్టిక్ బ్యాగులలో చిన్నచిన్న ముక్కలుగా ఉన్న తెల్లచందనం (శ్రీగంధం) చెక్కలను గుర్తించారు. ఫారెస్ట్ అధికారులను పిలిపించి నిర్ధారించుకున్న అనంతరం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వెయ్యి కిలోల బరువున్న గంధం చెక్కల విలువ రూ.35 లక్షలు ఉంటుందని ఏసీపీ తెలిపారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా జాత్ తహసీల్ ఉంట్వాడీ గ్రామం నుంచి చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం నాగరగూడలోని ఆంధ్ర పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీకి వీటిని తరలిస్తున్నారు. పట్టుబడిన ముగ్గురిలో తెల్లచందనం సాగు చేస్తున్న మహారాష్ట్రకు చెందిన విజయ్ హన్మంత్ మానే, డీసీఎం డ్రైవర్ అబ్దుల్ అజీజ్, ఫ్యాక్టరీ సూపర్‌వైజర్ సోహెబ్ ఉన్నారు. అనుమతులు లేకుండా తెల్లచందనం కొనుగోలు చేసి, తీసుకువస్తున్న ఫ్యాక్టరీ యజమాని అబ్దుల్లా కున్హి, కంపెనీ మేనేజర్ సాదిక్‌పై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. సదరు ఐదుగురు వ్యక్తులపై అటవీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన ముగ్గురు గతంలో ఒకే పర్ఫ్యూమ్ కంపెనీలో పనిచేశారని పోలీసులు వెల్లడించారు. కొనుగోలు చేసిన తెల్లచందనాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నారని తెలిపారు. డీసీఎంతో పాటు నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో చేవెళ్ల సీఐ భూపాల్‌శ్రీధర్, మాదాపూర్ ఎస్‌ఓటీ సీఐ సంజయ్‌కుమార్, ఫారెస్ట్ అధికారి రవికుమార్, ఎస్‌ఐలు వనం శిరీష, ఎస్‌ఓటీ ఎస్‌ఐలు సతీష్, బారాజ్ ఉన్నారు.
అక్రమంగా తరలిస్తున్న వెయ్యి కిలోల శ్రీగంధం చెక్కలు స్వాధీనం
ఐదుగురిపై కేసు నమోదు, పరారీలో ఇద్దరు
పట్టుబడిన సరుకు విలువ రూ.35 లక్షలు
వివరాలు వెల్లడించిన చేవెళ్ల ఏసీపీ కిషన్