
పరిశ్రమల్లో భద్రతా చర్యలు తప్పనిసరి
● డీఆర్‌ఓ సంగీత
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పరిశ్రమల్లో నిబంధనల మేర కు అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవె న్యూ అధికారి సంగీత సంబంధిత అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం పరిశ్రమలు, అగ్నిమాపక, పోలీసు శాఖలతో పాటు జిల్లాలోని పరిశ్రమల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ.. పరిశ్రమల్లో మౌలిక సదుపాయాలు, ఫైర్ సేఫ్టీ, మెడికల్ అండ్ హెల్త్ ఎంతో ముఖ్యమని అన్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ ఉందో లేదో తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేయ డంతో పాటు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ చేపట్టాలని సూచించారు. ఇందులో స్థానికంగా ఉండే ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఫైర్ సేఫ్టీ, పొల్యూషన్ కంట్రోల్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ ఇన్‌చార్జి అధికారి యాదయ్య, జిల్లా అగ్నిమాప శాఖ అధికారి మురళీ మనోహర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.