
‘డబుల్’.. లబ్ధిదారులకు ట్రబుల్!
మంచాల: అనధికారికంగా డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వచ్చిన లబ్ధిదారులపై కేసులు నమోదు చేశామని మంచాల సీఐ మధు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని లింగంపల్లి గేట్ వద్ద గత ప్రభుత్వం 96 డబుల్ ఇళ్లను నిర్మించింది. వాటిలో మంచాల, నోముల, లింగంపల్లి గ్రామాలకు 30 చొప్పున లాటరీ పద్దతిలో 90మంది లబ్ధిదారులను గుర్తించారు. మరో ఐదు ఇళ్లు గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చెన్నారెడ్డిగూడ గ్రామస్తులకు కేటాయించగా.. మరొకటి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచ్చిన రైతుకు కేటాయించారు.
మరో 20 మందిపై కేసు?
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేర్లు ప్రకటించినప్పటికీ అధికారికంగా ప్రొసీండింగ్‌లు ఇవ్వలేదు. ఇంతలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. నాటి నుంచి మూడు, నాలుగు దఫాలు తమకు ఇళ్ల ప్రొసీడింగ్స్ ఇవ్వాలంటూ గత ప్రభుత్వం ప్రకటించిన లబ్ధిదారులు అధికారులను కోరారు. తహసీల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నెల 28న ఎమ్మెల్యే పర్యటనలో తమకు ఇళ్లు ఇవ్వాలంటూ ధర్నాకు దిగారు. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించిన తర్వాతే ఇళ్లు ఇస్తామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. ఇదేమీ పట్టించుకోనివారు ఈ నెల 29న ఇళ్లలోకి వచ్చారు. అనధికారికంగా ఇళ్లలోకి రావొద్దని రెవెన్యూ అధికారులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. తాజాగా సోమవారం ఆర్‌ఆండ్‌బీ ఏఈ వినోద్ డబుల్ ఇళ్ల పనులు పూర్తవ్వకుండానే ఇళ్లలోకి వచ్చారని మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ మధు, ఏఎస్‌ఐ సతీశ్, పోలీసు సిబ్బంది డబుల్ ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ సూచనలు పాటించకుంటే కేసు నమోదు చేస్తామని చెప్పడంతో 60 మందిలో 40 మంది అక్కడ నుంచి వెనుదిరిగారు. మరో 20 మందిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ వివరించారు.
ఇళ్ల ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
సీఐ సూచనమేరకు ఖాళీ చేసిన 40 మంది