
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
అబ్దుల్లాపూర్‌మెట్: రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. హయత్‌నగర్‌లోని తొర్రూర్ క్రాస్ రోడ్డులో నివాసముండే దారమల్ల అశోక్ (27) ఆదివారం సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి వచ్చాడు. రాత్రి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రామోజీ ఫిల్మ్‌సిటీ గేటు వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో అశోక్ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురికీ తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
కార్మికుడి బలవన్మరణం
పహాడీషరీఫ్: ఉరేసుకుని ఓ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఎల్.వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. యూపీ రాష్ట్రానికి చెందిన రాంబోలి కుమారుడు పంకజ్(25) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి బోరబండలో నివాసం ఉంటున్నాడు. తుక్కుగూడ సర్దార్‌నగర్‌లో మార్బుల్స్ బండల పాలిష్ చేసేందుకు గుత్తేదారు వద్దకు వచ్చాడు. ఉదయం 11 గంటల సమయంలో సమీపంలో ఓపెన్‌గా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి వేప చెట్టుకు టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
అయ్యప్ప స్వామి సన్నిధానంలో విగ్రహాల చోరీ
ఇబ్రహీంపట్నం: అయ్యప్పస్వామి సన్నిధానంలో పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన ఘటన మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ చందర్ సింగ్ తెలిపిన ప్రకారం.. దండుమైలారం శివారులో ఉన్న అయ్యప్ప స్వామి సన్నిధానం డోర్ గడియను పగులగొట్టి లోనికి దూరిన గుర్తు తెలియని దుండగులు ఒక వెండి, ఐదు పంచలోహ విగ్రహాలు, గ్యాస్ సిలిండర్, వంట సామగ్రిని ఎత్తుకెళ్లారన్నారు. వాటి విలువ సుమారు రూ.1.20 లక్షల మేర ఉంటుందన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి