
నేడు బాధ్యతల స్వీకరణ
కందుకూరు: లయన్స్ క్లబ్ 320ఏ జిల్లా గవర్నర్‌గా మండల కేంద్రంలోని భూలక్ష్మీ ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ జి.మహేంద్రకుమార్‌రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు. సామాజిక స్పృహ, సేవాతత్పరత కలిగిన ఆయన గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తూ, స్వచ్ఛంద సంస్థ అయిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్‌లో చేరారు. 2007–08 కందుకూరు లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైయింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం జిల్లా గవర్నర్ స్థాయికి చేరుకున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించి సంస్థ అభివృద్ధికి పెద్దన్న పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన సంస్థ జిల్లా గవర్నర్‌గా ఎంపిక చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 90 క్లబ్‌లతో పాటు వికారాబాద్, పాత మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలతో పాటు నైజాం ప్రాంతంలోని కల్యాణ కర్ణాటక, రాయచూరు, సేడం, గుల్బర్గా, యాదగిరి తదితర ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోని 40 క్లబ్‌ల వరకు జిల్లా గవర్నర్ పరిధిలో కార్యక్రమాలు కొనసాగించాలి. ఆయా క్లబ్‌లలో దాదాపుగా 3,500 మందికి పైగా సభ్యులు ఆయన ఆధ్వర్యంలో పని చేయనున్నారు.
ఇది గురుతర బాధ్యత
ఈ సందర్భంగా డాక్టర్ మహేంద్రకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా గవర్నర్‌గా పని చేయడం ఒక గురుతరమైన బాధ్యత అన్నారు. ఈ స్థాయికి రావడానికి నా సమయం చాలా వెచ్చించాల్సి వచ్చిందన్నారు. తన ముందున్న మార్గదర్శకుల అంచనాలను అందుకోవాలని, సేవలలో గ్లోబల్ లీడర్‌గా తన జిల్లాను నిలబెట్టాలనేదే ఆశయమన్నారు. తనకు సహకరించిన కందుకూరు, ఆమనగల్లు క్లబ్ సభ్యులతో పాటు జిల్లా పరిధిలోని సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
హెలెన్ కెల్లర్ సేవా వారోత్సవాలు
తన బాధ్యతల స్వీకరణ సందర్భంగా జూలై 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు హెలెన్ కెల్లర్ సేవా వారోత్సవాలు ప్రతి ఒక్క క్లబ్ నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇందులో ప్రతి రోజు కంటి వైద్య శిబిరాలు, అవసరమైనవారికి ఆపరేషన్లు, రక్తదాన శిబిరాలు, డయాబెటిక్ నిర్ధారణ శిబిరాలు, ఉచితంగా స్టేషనరీ అందించడం, వైద్య శిబిరాలు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
లయన్స్ క్లబ్ 320ఏ జిల్లా గవర్నర్‌గా మహేంద్రకుమార్‌రెడ్డి