
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
కొందుర్గు: ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారి సురేశ్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం ‘సాక్షి’దినపత్రికలో ‘కొరత చూపి..రైతులను దోచేసి..’అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించి కొందుర్గు రైతువేదికలో ఎరువులు, విత్తనాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, రైతులకు విధిగా రసీదులు ఇవ్వాలని సూచించారు. లేదంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఈ సందర్బంగా పలువురు డీలర్లు మాట్లాడుతూ.. తమకు హోల్‌సేల్ డీలర్లు ఎమ్మార్పీ ధరలకన్నా అధికంగా ఎరువులను విక్రయిస్తున్నారని, దీనికితోడు రవాణా, హమాలి ఖర్చులు అధికమవుతున్నాయని వాపోయారు. ఎరువులు అమ్మడం వల్ల నష్టాలపాలవుతున్నామని వాపోయారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్లు మల్లారెడ్డి, శంకర్ రెడ్డి, యాదయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు