
రోడ్డుపై కుంట.. చూడకుంటే తంట !
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం ఎన్గల్ నుంచి మర్రిగడ్డ వరకు గల మూడున్నర కిలోమీటర్ల రోడ్డు తారు చెదిరిపోయి మోకాలులోతు గుంతలు పడ్డాయి. ఈ రోడ్డుపై ప్రయాణం క్షణమొక గండంగా మారింది. రోడ్డు మరమ్మతుకు రూ.1.35కోట్లు మంజూరైనట్లు ప్రకటనలు చేస్తున్నా పాలకులు పనులు మాత్రం ప్రారంభించడం లేదు. దీంతో ఇటీవల కురిసిన వర్షానికి ఎన్గల్ శివారులో తారు రోడ్డు చెదిరిపోయి భారీ గుంత ఏర్పడడంతో వర్షపు నీరు చేరి కుంటను తలపిస్తోంది. ఈ ప్రాంత ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్డు పనులు ప్రారంభమయ్యేలా చూడాలని కోరుతున్నారు.