నేటి నుంచి 30 పోలీసు యాక్ట్ అమలు
ఒంగోలు టౌన్: శాంతి భద్రతల్లో భాగంగా ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీసుయాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సబ్ డివిజన్ పరిధిలోని ప్రజా సంఘాలు, కార్మిక యూనియన్లు, రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించకూడదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా, ఉల్లంఘించినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్నారు.
మార్కాపురం రూరల్ (మార్కాపురం): మార్కాపురం నుంచి కంభం వైపునకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న హోంగార్డు చింతగుంట్ల వద్ద ఎద్దును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామానికి చెందిన పి.రాముడు జరుగుమల్లి పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై కంభం వెళ్తూ చింతగుంట్ల వద్ద అరకతో వెళ్తున్న ఎద్దును ఢీకొని కిందపడటంతో గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై అంకమరావు తెలిపారు.
పీసీపల్లి: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గుదేవారిపాలెం సమీపంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..రామాపురం గ్రామానికి చెందిన గన్నవరపు మాలకొండయ్య(50) టీ తాగేందుకు రామాపురం నుంచి గుదేవారిపాలెం నడుచుకుంటూ వస్తున్నాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో కనిగిరి నుంచి పీసీపల్లి వెళుతున్న కారు ఢీకొట్టడంతో మాలకొండయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలుఉన్నారు.
ఉలవపాడు: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉలవపాడు మండల పరిధిలోని కరేడు పంచాయతీ చిల్లకాల్వ సమీపంలోని రొయ్యల చెరువుల వద్ద ఆదివారం జరిగింది. ఆ వివరాల మేరకు.. వేటపాలెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన రావూరి సాంబశివరావు (52) ఉలవపాడు గ్రామానికి చెందిన ఓగుబోయిన ప్రసాద్‌కు చెందిన చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. గత 17 ఏళ్ల నుంచి తన భార్య కోటేశ్వరమ్మతో విభేదించి వచ్చి రొయ్యల చెరువుల వద్ద ఉన్న రేకుల షెడ్డులోనే ఉంటున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెంది చనిపోవాలనే ఉద్దేశంతో రేకుల షెడ్డుకు ఉన్న ఇనుప కమ్మెకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని సీఐ అన్వర్ బాషా, ఎస్సై అంకమ్మ పరిశీలించారు. భార్య కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మార్కాపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరైనా రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇంతవరకూ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకపోవడం శోచనీయమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు విమర్శించారు. ఇప్పటికి పలు దఫాలుగా వాయిదాలు వేశారని, వచ్చే జనవరి 1వ తేదీలోపు కార్డులు ఇవ్వకుంటే సమాచార శాఖామంత్రి పార్థసారధి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, ప్రమాద బీమా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఇంతవరకూ పరిష్కరించలేదని అన్నారు. సమాచార శాఖాధికారులతో ఎన్నిసార్లు మాట్లాడినా స్పందించడం లేదని ఆరోపించారు. నవంబరు 30వ తేదీతో అక్రెడిటేషన్ కార్డుల గడువు ముగిసిందని, కొత్త కార్డులు ఇస్తామని చెప్పి మళ్లీ 2 నెలలు పొడిగించారని అన్నారు. జనవరి 1కి గుర్తింపు కార్డులు ఇవ్వకుంటే మంత్రి రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ రమణ, రాష్ట్ర నాయకుడు అల్లూరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి 30 పోలీసు యాక్ట్ అమలు


