గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద పోలీసుల తనిఖీలు
మద్దిపాడు: మండలంలోని మల్లవరం సమీపంలో ఉన్న కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్, ఆ పక్కనే ఉన్న మల్లవరం వెంకటేశ్వరస్వామి దేవాలయం, పరిసరాలను ఆదివారం పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మద్దిపాడు ఎస్సై వెంకట సూర్య, ఆర్‌ఎస్‌ఐ తిరుపతిస్వామి, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం సభ్యులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రవేశ మార్గాలు, డ్యామ్ పైభాగం, ఉద్యానవన ప్రదేశాలను తనిఖీ చేశారు. పేలుడు పదార్థాలను గుర్తించే ప్రత్యేక జాగిలంతో సహా బాంబ్ డిస్పోజల్ టీంతో పరిశీలించారు. ప్రజలు తరచూ సందర్శించే ప్రదేశం కావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలను గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని, లేకుంటే డయల్ 112 కాల్ చేయాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు నేర నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యమని మద్దిపాడు ఎస్సై తెలిపారు.
మార్కాపురం టౌన్: పట్టణంలో ఆదివారం ఎంవీఐ మాధవరావు చేపట్టిన వాహన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మూడు వాహనాలను సీజ్ చేశారు. పన్ను చెల్లించకుండా తిరుగుతున్న ఒక బస్సుకు 98,365 రూపాయల జరిమానా విధించారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని రెండు వాహనాలను సీజ్ చేశారు. వాటిపై కేసులు కూడా నమోదు చేసినట్లు ఎంవీఐ తెలిపారు.


