పెంచలయ్య హంతకులను కఠినంగా శిక్షించాలి
ఒంగోలు టౌన్: నెల్లూరుకు చెందిన సీపీఎం నాయకుడు, ప్రజా కళాకారుడు పెంచలయ్యను దారుణంగా హత్య చేసిన గంజాయి ముఠాను కఠినంగా శిక్షించాలని డైఫీ ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. హంతకులను శిక్షించాలని కోరుతూ ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెంచలయ్య హత్య రాష్ట్రంలో గంజాయి ముఠా ఎంతగా చెలరేగిపోతుందో తెలియజేస్తుందని చెప్పారు. ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పోలీసు అధికారులతో కలిసి గంజాయి వ్యతిరేక సదస్సులను నిర్వహించిన పెంచలయ్యకు రక్షణ కల్పించడంలో పోలీసులు వైఫల్యం చెందారన్నారు. ప్రజా నాట్యమండలి నాయకుడు పేతూరు మాట్లాడుతూ గంజాయి , మత్తు మందులకు బానిసలైన విద్యార్థులు అనేక మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెడు మార్గం పట్టిన యువకులు ఎంతటి దారుణాలకై నా ఒడిగడుతున్నారన్నారు. సంఘవిద్రోహ శక్తులుగా మారుతూ సమాజానికి, తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతున్నారని చెప్పారు. ప్రభుత్వం, పోలీసులు నిబద్ధతగా వ్యవహరించకపోవడం వల్లే గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నారని, పట్టపగలే హత్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైఫీ నగర కార్యదర్శి పి.కిరణ్ మాట్లాడుతూ పెంచలయ్య హత్యపై పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే గంజాయి ముఠాలు మరింతగా రెచ్చిపోవడం ఖాయమన్నారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం గంజాయి పట్ల కట్టడి చేయడానికి ప్రయత్నం చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయ్, ఆనంద్, రాజేశ్వరి, ఇంద్రజ్యోతి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలో
డైఫీ,ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా నేతల ర్యాలీ


