మార్కాపురం జిల్లా ప్రకటనలోనే అన్యాయం
యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా మార్కాపురం జిల్లాగా ప్రకటించడంలోనే అన్యాయం జరిగిందని, ఎటువంటి ఆర్థిక వనరుల సమకూర్చకుండా పశ్చిమ ప్రాంత ప్రజల కన్నీటి తుడుపుగా జిల్లాగా ప్రకటించి చేతులు దులుపుకున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవేండ్ల శ్రీనివాస్ ఆరోపించారు. శ్రీశైలం మండలాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గంలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక పూలసుబ్బయ్య శాంతి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం దేవస్థానాన్ని గతంలో కర్నూలు జిల్లాలో కలిపారని, జిల్లాల పునర్విభజన సమయంలో కూడా ఆ దేవస్థానాన్ని నంద్యాల జిల్లాకు మార్పు చేశారన్నారు. నంద్యాల జిల్లాకు దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలంను కొత్తగా ఏర్పాటు చేస్తున్న మార్కాపురం జిల్లాలో ఎందుకు కలపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు శ్రీశైలం వెళ్లాలంటే మార్కాపురం జిల్లాలో అంతర్‌భాగమైన పెద్దదోర్నాల నుంచి వెళ్లాల్సిందేనని, శ్రీశైలం మండలాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గంలో కలిపితే పూర్తిగా వెనకబడిన మార్కాపురం జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దర్శి నియోజకవర్గాన్ని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురం జిల్లాలో కలపకుండా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలులో కలపడం పశ్చిమ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలం మండలం, దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలపకుంటే ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, బాణాల రామయ్య, వై.వెంకటశివయ్య పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవేండ్ల శ్రీనివాస్


