
నేడు తుమ్మలచెరువులో పెద్ద షహాదత్
తర్లుపాడు: మొహర్రం వేడుకల్లో భాగంగా ఆదివారం తుమ్మలచెరువులో పెద్ద షహాదత్ నిర్వహించనున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలను హిందూ, ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దర్గాలో కొలువైన పెద్ద ఖాశీం స్వామి, చిన్న ఖాశీం స్వాములను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పీర్ల మకాన్, దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. శనివారం రాత్రి అగ్ని గుండం మండించారు. తెల్లవారుజామున స్వామివారిని గ్రామంలో ఊరేగిస్తారు. కాగా, ఆర్టీసీ ఆధ్వర్యంలో తరుమ్మలచెరువుకు ప్రత్యేక బస్సులు, దర్గా కమిటీ ఆధ్వర్యంలో అన్న సంతర్పణకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పొదిలి సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఏరులై పారుతున్న మద్యం
పెద్ద షహాదత్ సందర్భంగా ఖాశీం స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తుండటంతో మార్కాపురానికి చెందిన సిండికేట్ నాయకుడు తన మనుషుల ద్వారా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నాడు. ఎకై ్సజ్, పోలీసు అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడంతో ఇష్టానుసారంగా ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు.