
మద్యం, గంజాయి
పొందూరులో విచ్చలవిడిగా
మద్యం సమస్యపై మంత్రి స్వామికి ఫిర్యాదు చేస్తున్న పొందూరు మహిళలు
టంగుటూరు: ‘సార్.. మా ఊరిలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కొందరు వీధుల్లోనే మద్యం తాగి అసభ్యకరంగా ప్రవరిస్తున్నారు. గడప దాటి బయటకు రావాలంటే భయమేస్తోంద’ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డీబీవీ స్వామి ఎదుట పొందూరు గ్రామ మహిళలు వాపోయారు. మంగళవారం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొందూరు వెళ్లిన మంత్రికి మహిళలతోపాటు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వివరాలు.. పొందూరులో నలుగురు వ్యక్తులు అక్రమ మద్యం, గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నారు. వీరి నుంచి గ్రామ టీడీపీ నాయకుడైన ఎంపీటీసీ సోదరుడు నెలకు రూ.30 వేలు తీసుకుని పోలీసులు దాడి చేయకుండా కాపాడుకుంటూ వస్తున్నాడని టీడీపీ నాయకుడు తగరం కోటేశ్వరరావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లైసెన్స్‌డ్ దుకాణాల నుంచి మద్యం తీసుకొచ్చి బెల్ట్ షాప్‌లో విక్రయిస్తూ ఒక్కో క్వార్టర్‌పై రూ.50 అధికంగా వసూలు చేస్తున్నారని, గంజాయి ప్యాకెట్లు బహిరంగంగానే అమ్ముతున్నారని వివరించారు. తాగుబోతులు రచ్చ రచ్చ చేస్తుండటంతో బయటకు రావాలంటేనే భయంగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పొందూరు మద్యం, గంజాయి విక్రయాల గురించి ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, వారికి నెల నెలా క్రమం తప్పకుండా ముడుపులు అందుతుండటం వల్లే గ్రామంవైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు.
ఆగమేఘాలపై ముగ్గురు అరెస్టు
నలుగురు వ్యక్తులు మద్యం విక్రయిస్తున్నారని మంత్రికి మహిళలు ఫిర్యాదు చేయగా టంగుటూరు పోలీసులు రంగంలోకి దిగారు. సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్సై నాగమళ్లీశ్వరరావు తమ సిబ్బందితో కలిసి గ్రామానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను బైండోవర్ చేశామని, పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు.
మంత్రి స్వామికి గ్రామస్తులు, మహిళల ఫిర్యాదు ఎకై ్సజ్ శాఖ అధికారుల తీరుపై ఆరోపణలు