
ఇంగ్లిష్ బోధించేందుకు దరఖాస్తు చేసుకోవాలి
నాగులుప్పలపాడు: మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో ఏపీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ బోధించేందుకు బీఈడీ, పీజీ అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కె.మాధవి తెలిపారు. పూర్తి వివరాలకు 87126 25043 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
విమానాల ల్యాండింగ్‌కు భూసేకరణ
సింగరాయకొండ: విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని, ఇందుకోసం అవసరమైన భూసేకరణ చేపట్టాల్సి ఉందని, త్వరలో ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ జారీ అవుతుందని వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ కలెక్టర్ ఎం.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఆయన డిప్యూటీ తహసీల్దార్ టి.ప్రసాద్, సర్వేయర్ బ్రహ్మంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భూసేకరణకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలు వస్తాయని, మార్కింగ్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఇరువైపులా స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. అధికారులు మాట్లాడుతూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అభివృద్ధి పనులు త్వరలో చేపడతామని, ఇందుకోసం నిధులు కూడా మంజూరయ్యాయన్నారు. గతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ను ఎక్కడా వంకర లేకుండా నిర్మించాల్సి ఉండగా కొంతమేర వంకరగా నిర్మించడంతో రన్‌వేకు పనికిరాదని ఎయిర్‌ఫోర్స్ అధికారులు నిర్ణయించారని, ఇప్పుడు రన్‌వే వంకర సరి చేసేందుకు రోడ్డుకు ఇరువైపులా 6 మీటర్ల చొప్పున స్థల సేకరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అప్పుడు రన్‌వేను నిబంధనల ప్రకారం నిర్మిస్తామని వివరించారు.
మార్కాపురం మీదుగా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు
మార్కాపురం: నాందేడ్ నుంచి తిరుపతి వరకూ మార్కాపురం మీదుగా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును జూలై 4, 11, 18, 25 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మార్కాపురం పట్టణానికి చెందిన గుంటూరు డీఆర్‌ఈసీసీ మెంబర్ ఆర్‌కేజే నరసింహం తెలిపారు. ఈ రైలు నాందేడ్‌లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల మీదుగా వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుతుందని వివరించారు. ఈ రైలు మార్కాపురం రోడ్ స్టేషన్‌కు వచ్చేసరికి తెల్లవారుజామున 3 గంటలు అవుతుందని, అదేరోజు మధ్యాహ్నం తిరుపతి చేరుతుందని తెలిపారు. మళ్లీ తిరిగి అదే రైలు మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి రాత్రి 9.30 గంటలకు మార్కాపురం చేరుతుందని చెప్పారు. ప్రస్తుతానికి ప్రతి శుక్రవారం తిరుపతి వెళ్లేందుకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని తిరుపతివెళ్లే వారు వినియోగించుకోవాలని కోరారు. ఇందులో ఏసీ టూటైర్, త్రీటైర్, స్లీపర్, జనరల్ బోగీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.