సమస్యలు చెప్పండి.. పరిష్కరిస్తా

ఒంగోలు టౌన్: మీ సమస్యలేమిటో చెప్పండి.. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తా అంటూ పోలీసు సిబ్బందికి ఎస్పీ మలికా గర్గ్ భరోసా ఇచ్చారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సంక్షేమ దివస్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీసులు, హోంగార్డుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. శాఖాపరంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసు సిబ్బంది, హోంగార్డులు ఎస్పీకి విన్నవించుకున్నారు. వారి నుంచి వినతి పత్రాలు తీసుకున్న ఎస్పీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా సత్వర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బంది సమస్యలను పరిష్కరించడం ద్వారా వారు మరింత క్రియాశీలకంగా ప్రజలకు సేవలు అందజేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో డీపీఓ ఏఓ ఎం.సులోచన, ఐసీసీఆర్ ఇన్‌స్పెక్టర్ ఒ.దుర్గా ప్రసాద్, ఎస్సై భవాని తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ మలికా గర్గ్