
గుంటూరు ఎడ్యుకేషన్/ సాక్షి, విశాఖపట్నం/ శ్రీరంగరాజపురం/ చిలకలూరిపేట: ‘యువగళం పేరుతో నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రతో టీడీపీ భూ స్థాపితం కానుంది. లోకేశ్‌ది ఐరన్ లెగ్. ఆ లెగ్ ఎఫెక్ట్‌తో తారకరత్న పరిస్థితి విషమంగా ఉంది. లోకేశ్‌కు ఏ విషయంపై కూడా స్పష్టత లేదు. అంతా గందరగోళం.. తింగరి మేళం. లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చింది మొదలు టీడీపీకి అన్నీ అపశకునాలే’ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, పర్యాటక శాఖ మంత్రి రోజా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. శనివారం వారు వేర్వేరు చోట్ల మీడియాతో మాట్లాడారు.
అది గరళం అని త్వరలోనే తెలుస్తుంది
నారా లోకేశ్ యువగళం టీడీపీని భూస్థాపితం చేస్తుంది. పాదయాత్ర కొంత దూరం పోయిన తర్వాత అది యువగళమో లేక యువగరళమా అనేది ప్రజలకు తెలుస్తుంది. లోకేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది. పాదయాత్రలో పాల్గొన్న తొలి రోజే ఆస్పత్రి పాలైన నందమూరి తారకరత్న పరిస్థితి విషమంగా ఉండటం బాధాకరం.
నారా కుటుంబ రాజకీయాలకు బలవ్వడం తప్ప, నందమూరి కుటుంబానికి మిగిలేదేమీ లేదు. పవన్ నానమ్మ దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే, దాంతో ఆయన తండ్రి సిగరెట్ వెలిగించుకున్న హేతువాది అన్నారు. దీనిపై చిరంజీవి, నాగబాబు సమాధానం చెప్పాలి. అచ్చెన్నాయుడు పోలీసులను తిట్టడం టీడీపీ పతనానికి నాంది. – అంబటి రాంబాబు, జలవనరులశాఖ మంత్రి
పథకాలను ఆపేస్తామని చెప్పే ధైర్యం ఉందా?
ఏ విషయంలోనూ స్పష్టత లేకుండా పాదయాత్ర చేస్తున్న వ్యక్తిగా నారా లోకేష్ చరిత్రలో నిలిచిపోతారు. వైఎస్ జగనన్న పాలనలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. లోకేశ్ పాదయాత్రలో అమ్మ ఒడి పథకం అవసరం లేదని చెప్పగలరా? రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, ఆరోగ్యశ్రీ పథకాలేవీ రాష్ట్ర ప్రజలకు వద్దని చెప్పే ధైర్యం ఉందా? కనీసం వారి సీఎం అభ్యర్థి ఎవరో లోకేశ్ చెబుతారా? ఏమీ చెప్పలేరు. అంతా గందరగోళం.
– విడదల రజిని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
అచ్చెన్నా.. నోరు అదుపులో పెట్టుకో
అచ్చెన్నాయుడూ.. నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే నాలుక కోస్తా. గతంలో పార్టీ లేదు.. బొక్కా లేదు.. లోకేశ్ రాజకీయానికి పనికిరాడు.. తినడం తప్ప రాజకీయ పరిణతి లేదని మీరు చెప్పలేదా? పోలీస్ వ్యవస్థపై, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి.
– నారాయణస్వామి, డిప్యూటీ సీఎం
ఐరన్‌లెగ్ సైకో
మహిళలు, ప్రజల ప్రాణాలపై కనీస గౌరవం లేని చంద్రబాబు సైకో అయితే.. ఆయన కుమారుడు లోకేశ్ అలియాస్ పులకేశ్ ఐరన్‌లెగ్ సైకో. లోకేశ్ గోదావరి పుష్కరాలకు వెళ్లి.. 29 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వాళ్ల నాన్న చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయి. పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరించిన రోజు చంద్రబాబు రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. ఈ ఐరన్‌లెగ్ రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తే ఏం జరుగుతుందోనని ప్రజలంతా భయపడుతున్నారు.
– ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి