బాబు 'స్కిల్‌'.. డెవలప్‌మెంట్‌ 'స్కాం' | KSR On Chandrababu Naidu Multi Crore AP Skill Development Corruption Case - Sakshi
Sakshi News home page

బాబు 'స్కిల్‌'.. డెవలప్‌మెంట్‌ 'స్కాం'

Sep 9 2023 12:56 PM | Updated on Sep 9 2023 1:43 PM

KSR On Chandrababu Multi Crore Skill Development Scam - Sakshi

ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు ఒక కేసులో అరెస్టు అయ్యారు. నిజానికి మొదట ఈ మాట విన్నవారు ఎవరూ నమ్మి ఉండకపోవచ్చు. చంద్రబాబును అరెస్టు చేయడమా? అది సాధ్యమేనా? ఆయన ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటుంటారు కదా అని భావిస్తారు. కాని ఒక స్కామ్ లో ఆయన అరెస్టు అయ్యారన్న వార్త  నిర్ధారణ అయిన తర్వాత ఆ కేసు గురించి తెలుసుకుని నోళ్లు  వెళ్లబెడుతున్నారు. చంద్రబాబు  ఇన్ని వందల కోట్ల అవినీతిని అలవోకగా ఎలా చేసేశారు? సీఐడీ మొత్తం అన్ని కూపీలు లాగి పకడ్బందీగా ఎలా కేసు పెట్టగలిగింది?

✍️యువతకు నైపుణ్యాభివృద్ది పేరుతో స్కిల్డెవలప్‌మెంట్ కార్పొరేషన్  ఏర్పాటు చేసి, ఆ సంస్థ పేరుతో డబ్బులు కొట్టేసే స్కిల్‌ను ప్రభుత్వ పెద్దలు ప్రదర్శించడం ఏమిటి?ప్రముఖ కంపెనీ సీమెన్స్ తో సంబంధం లేకుండా ఆ సంస్థ పేరును ఎలా వాడగలిగారు? 3700 కోట్ల వ్యయం ఆ ప్రాజెక్టుకు అవుతుందని ఎలా అంచనా వేశారు?అందులో పది శాతం ఏపీ ప్రజల సొమ్ము రూ. 371 కోట్లను ఎలా వెచ్చించారు. అది పూర్తిగా సద్వినియోగం అయి యువతకు ఉపయోగపడితే మంచిదే. కాని అలా జరగలేదే!

✍️అందులో రూ. 240 కోట్లు వేరే రూట్లలో ఎక్కడికి వెళ్లిపోయింది?సీమెన్స్ కంపెనీ అసలు తమకు ఈ సంస్థ గురించే తెలియదని ఎలా ప్రకటించింది? ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి పలువురిని అరెస్టు చేసింది కదా?అయినా చంద్రబాబు నాయుడు తాను అమాయకుడనని ఎలా చెప్పగలుగుతున్నారు? నిజమే! చంద్రబాబు ఏది చేసినా తన చేతికి మట్టి అంటకుండా జాగ్రత్తపడతారని అంటారు. ఆయా సందర్భాలలో ఆయనే తాను లీగల్‌గా టెక్నికల్‌గా దొరకనని సగర్వంగా చెప్పుకున్నారు.

✍️అలాంటి తెలివైన మనిషి కూడా ఈ స్కామ్ లో ఎలా పట్టుబడిపోయారు? అంటే తప్పులు చేసేవారు ఏదో ఒక రోజు , ఎక్కడో అక్కడ దొరికిపోక తప్పదని ఈ కేసు సారంశమా?  కొందరు అధికారులు ఈ నిధుల విడుదలకు సంబంధించి అధికారికంగా రాసిన విషయాలే చంద్రబాబు కొంపముంచాయి. ఏపీ ప్రభుత్వం స్కిల్ కార్పొరేషన్ పక్షాన పది శాతం నిధులను విడుదల చేసిన తీరే ప్రధానాంశం అయింది. అప్పటి అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయమంటున్నారని, నిబంధనలను పాటించకుండా డబ్బులు ఇవ్వమంటున్నారని ఫైల్‌లో రాసేశారు. ఆ విషయాలన్నిటిని ఏపీ సీఐడీ కనిపెట్టింది. మొత్తం ఫైళ్లన్నిటిని తీసుకుని అధ్యయనం చేసింది. నిజానికి చంద్రబాబు టైమ్‌లోనే ఈ స్కామ్ బయటకు వచ్చింది. కాని దానిని కప్పిపుచ్చేసి కథ నడిపారు. ముంబై లోని జీఎస్టీ అధికారులు తొలుత ఈ స్కామ్‌ను గుర్తించారు.అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదట. దానికి కారణం వారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండడమే కారణమని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

దీనిపై అప్పట్లో ఈ కార్పొరేషన్లో పనిచేసిన కొందరు అధికారులను ఇప్పటికే అరెస్టు చేశారు. ఒక మాజీ ఐఎఎస్ మాత్రం అనారోగ్యం కారణంగా అరెస్టు కాకుండా తప్పించుకోగలిగారు. ఆ తర్వాత ఇందులో ఉన్న మనీ లాండరింగ్ తదితర అంశాలపై ఈడీ దృష్టి సారించి సుమారు నలభై కోట్ల రూపాయల మేర ఆస్తులను కూడా అటాచ్ చేసింది. తాజాగా ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసులలో బహిర్గతమైన అవినీతి వ్యవహారాలపైన , అలాగే స్కిల్ కేసుకు వాటికి ఉన్న కనెక్షన్ మొదలైనవాటిని ఆరా తీసేందుకు చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు శ్రీనివా\స్‌కు  అలాగే మనోజ్ వాసుదేవ్ పార్ధసాని, యోగేష్ గుప్త అనేవారికి ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడంతోనే శ్రీనివాస్ , మనోజ్లు దేశం విడిచివెళ్లిపోయారని చెబుతున్నారు.

✍️అంటే వారు విచారణకు వస్తే మొత్తం అన్ని విషయాలు మరింత సమగ్రంగా బయటకు వచ్చే అవకాశం ఉన్నందున చంద్రబాబే వారిని పంపించి ఉంటారని వైసీపీవారు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో సీఐడీ చంద్రబాబునే అరెస్టు చేయవలసి వచ్చింది. వారు పరారీకాకుండా ఉంటే, మరికొంత వ్యవధి తీసుకునేవారేమో తెలియదు.సీఐడీ అదనపు డిజి సంజయ్ కేసు పూర్తి వివరాలు ఇస్తూ, చంద్రబాబే కుట్రదారుడు , చంద్రబాబే అంతిమ లబ్దిదారుడు అని తేలినట్లు వెల్లడించారు. ఇందులో చంద్రబాబు కుమారుడు లోకేష్ పాత్రను కూడా విచారిస్తున్నామని చెప్పారు.స్కిల్ కేసుతో పాటు, అమరావతి స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కామ్లలో ఆయన పాత్రపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

✍️దీనిని బట్టి తీగ లాగితే కొండ కదిలినట్లు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలు అన్నీ బయటకు వచ్చేలా ఉన్నాయి.  ఇదంతా రాజకీయ కక్ష అని చంద్రబాబు ఆరోపించడం ఆరంభించారు. సహజంగానే ఇలా అంటారని అందరికి తెలుసు. నిజంగా కక్ష కట్టదలిస్తే రెండేళ్ల క్రితం నమోదైన కేసులో ఇంతకాలం ఎందుకు ప్రభుత్వం ఓపిక పడుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మొత్తం పూర్తిస్థాయిలో విచారణ చేసి, ఈ కుంభకోణంలో  చంద్రబాబు పాత్ర  ఉందని నిర్దారణ చేసుకున్న తర్వాతే అరెస్టు చేశారని  ఆయన అన్నారు.ఇక ఇప్పుడు ఈ అరెస్టు వల్ల చంద్రబాబుకు, టీడీపీకి సానుభూతి వస్తుందా అన్న చర్చ కూడా ఉంది. సానూభూతి కోణంలోనే చంద్రబాబు హెలికాఫ్టర్ లో ప్రయాణించడానికి నిరాకరించి, రోడ్డు మార్గంలో విజయవాడ వెళుతున్నారట. అక్కడక్కడా టీడీపీ శ్రేణులు అడ్డుపడాలన్నది ఆయన కోరిక.గొడవలు జరగాలన్నది వారి అభిలాష కావచ్చు.

✍️దానిని ఎటూ పోలీసులు గట్టిగానే ఎదుర్కుంటారు.  ఇది అక్రమ కేసు అని కనుక జనం నమ్మితే అప్పుడు సానుభూతి వస్తుంది కాని,ముఖ్యమంత్రి హోదాలో ఉండి అనేక స్కాములకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తిని అరెస్టు చేస్తే ఎందుకు సానుభూతి వస్తుంది?ప్రజలు అంత అమాయకులా?ప్రభుత్వం పక్కాగా ఆధారాలతో సహా ప్రజలకు కేసు వివరాలను తెలియచేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కొందరు అరెస్టు అవడం, ఆస్తులు జప్తు కావడం జరిగింది.కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈడీ నే చర్యలు తీసుకున్న తర్వాత ఏపీ ప్రభుత్వ కక్ష అని ఎలా వాదిస్తారు? అందువల్ల ఈ కేసులో చంద్రబాబు ఇబ్బందిపడక తప్పదన్నది ఎక్కువ మంది భావన.

✍️అంతేకాదు.. రాజ్యాంగం, చట్టాలు చంద్రబాబుకు అతీతం కాదని ఇప్పుడు ప్రజలు భావిస్తారు.  ఆయన పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి గా  చేశారు కనుక అవినీతి స్కామ్ ఆరోపణలు వచ్చినా వదలివేయాలని ఏ చట్టం చెప్పదు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక  జరిగిన అనేక విచారణలలో చంద్రబాబు పై అభియోగాలు ఉన్నాయని  అధికారులు తేల్చారు. అయినా ఇప్పటివరకు చంద్రబాబుపై కేసులు నమోదు చేయడమే తప్ప ఎలాంటి అదనపు చర్యలు తీసుకోలేదు. దాంతో చంద్రబాబు , టీడీపీ నేతలు ఇంతకాలం తమపై ఎన్నో ఆరోపణలు చేసినా ఏమి పీకారని అంటుండేవారు. తమను ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేస్తుండేవారు. ఇప్పుడు సీఐడీ అరెస్టు చేసిన తర్వాత అక్రమం అని వాపోతున్నారు. రాజకీయ కక్ష అని అంటున్నారు. అంతే తప్ప స్కిల్ స్కామ్ లో వచ్చిన అభియోగాలపై నేరుగా వివరణ ఇవ్వలేకపోతున్నారు.

✍️ఏది ఏమైనా చంద్రబాబు ఇన్నాళ్టికి చట్టానికి దొరికాడని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.కాగా  చంద్రబాబు అరెస్టుతో టీడీపీ క్యాడర్ లో ఈ కేసుల వల్ల సానుభూతి వస్తుందో రాదో కాని, నైరాశ్యం ఏర్పడడం ఖాయమన్న భావన కూడ ఉంది. ప్రస్తుతం ఒక కేసులో అరెస్టు అయినందున , ఇప్పటికే ఆయనపై నమోదు అయిన ఇతర కేసులలో కూడా అరెస్టులు చూపించే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయం లేకపోలేదు. దేశంలో అవినీతి కేసులలో చిక్కుకుని అరెస్టు అయిన ముఖ్యమంత్రులు, మంత్రుల జాబితాలో చంద్రబాబు పేరు కూడా చేరింది.గతంలో ఓటుకు నోటు వంటి ముఖ్యమైన కేసులో తప్పించుకోగలిగిన చంద్రబాబు ,ఏపీలో స్కామ్ ల కేసులలో దొరికిపోవడం విశేషం.


-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement