నీటి లభ్యత కోసమే మేడిగడ్డకు..: హరీశ్‌రావు | BRS Leader Harish Rao Comments On Medigadda In Assembly | Sakshi
Sakshi News home page

నీటి లభ్యత కోసమే మేడిగడ్డకు..: హరీశ్‌రావు

Sep 1 2025 4:42 AM | Updated on Sep 1 2025 4:42 AM

BRS Leader Harish Rao Comments On Medigadda In Assembly

సీడబ్ల్యూసీ, నిపుణుల కమిటీ, రిటైర్డ్‌ ఇంజనీర్ల కమిటీలన్నీ అదే చెప్పాయి 

మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తుమ్మిడిహెట్టికి ఒప్పుకోలేదు 

పోలవరం 10 సార్లు కూలితే ఎన్‌డీఎస్‌ఏ ఎందుకు రాలేదు  

మేడిగడ్డలో కూలిన చోట మరమ్మతులు చేస్తే సరిపోతుంది 

శాసనసభలో మాజీ మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగించేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో కృషి చేశామని.. మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీడబ్ల్యూసీ, నిపుణుల కమిటీ, ఇతర సంస్థలన్నీ ఆ ప్రాజెక్టుకు ఒప్పుకోకపోవడం వల్లే దానిని మేడిగడ్డకు మార్చామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలను వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు అడ్డు తగిలారు. ఒక సమయంలో హరీశ్‌రావుకు స్పీకర్‌ మైక్‌ కట్‌ చేసి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు జోక్యంతో హరీశ్‌రావుకు స్పీకర్‌ కొంత సమయం ఇచ్చారు.  

తుమ్మిడిహెట్టి వద్ద ఉపయోగం లేదంటేనే.. 
నీటి లభ్యత లేకపోవడం, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం, చాప్రాల్‌ అభయారణ్యం ఉండటం వంటి కారణాలతోనే తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు ముందుకు సాగలేదని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్‌ స్వయంగా మహారాష్ట్ర సీఎంను కలిసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి రాసిన లేఖలోని మూడో పేజీలో తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. 

‘తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చినప్పుడు నీళ్ల ప్రవాహం ఎలా పెరిగింది అని మంత్రి జూపల్లి అంటున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్ల దూరం ఉండగా, మధ్యలో మహారాష్ట్రలోని 16 వాగులు, తెలంగాణలోని 8 వాగుల నీళ్లు కలుస్తాయి. మేడిగడ్డ దగ్గర అదనంగా 120 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. మా సూచన మేరకే అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కట్టి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చారని రిటైర్డ్‌ ఇంజినీర్లు కమిషన్‌కు స్పష్టంగా చెప్పారు. కానీ కమిషన్‌ వారి రిపోర్ట్‌ను పట్టించుకోలేదు’అని హరీశ్‌రావు వివరించారు.  

పోలవరం కూలితే ఎన్‌డీఎస్‌ఏ ఎందుకు రాలేదు? 
డీపీఆర్‌ లేకుండా టెండర్లు పిలుస్తారా అంటున్నారు. ప్రాణహితకు డీపీఆర్‌ 2009లో వస్తే, 28 ప్యాకేజీలకు టెండర్లు, మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చింది మీరు (కాంగ్రెస్‌ ప్రభుత్వం). నారాయణపేట లిఫ్టు ఇరిగేషన్‌కు డీపీఆర్‌ లేకుండా టెండర్లు పిలిచింది మీరు కాదా? జలయజ్ఞంలో ఎన్నో ప్రాజెక్టులకు డీపీఆర్‌లు లేకుండానే టెండర్లు పిలిచారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎన్‌డీఎస్‌ఏ గురించి గొప్పగా చెపుతున్నారు. దేశం మొత్తానికి ఒక నీతి, కాళేశ్వరానికి ఒక నీతి ఉంటదా? గోదావరి నదిపై కట్టిన పోలవరం 10 సార్లు కూలింది. 

ఎందుకు ఒక్కసారి కూడా ఎన్‌డీఎస్‌ఏ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు? ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌ అయ్యర్‌ పోలవరం ప్రాజెక్టు సీఈఓగా ఉన్న సమయంలోనే అది 5 సార్లు కూలింది. ఆయన ఇచ్చే రిపోర్టుకు ఇక విశ్వసనీయత ఏముంటది? ఎస్‌ఎల్బీసీ, సుంకిశాల కూలాయి. వట్టెం మునిగింది, పెద్దవాగు కొట్టుకుపోయింది. అయినా వీటి మీద ఎన్‌డీఎస్‌ఏ రాదు, కమిషన్లు వేయరు. ఎన్‌డీఎస్‌ఏ తన రిపోర్టులో మేడిగడ్డ బరాజ్‌ ఏడో బ్లాకు నిర్మించి ఆపరేషన్‌లోకి తేవాలి అని సూచిస్తే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?’అని ప్రశ్నించారు.  

మేడిగడ్డలో మరమ్మతు చేస్తే సరిపోతుంది.. 
మేడిగడ్డ బరాజ్‌లోని ఏడో బ్లాకులో మూడు పిల్లర్లు కుంగటం తప్ప వ్యవస్థ అంతా అద్భుతంగా ఉందని హరీశ్‌రావు తెలిపారు. ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకు మొత్తం తీసినా రూ.300 నుంచి రూ. రూ.4 వందల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. అది కూడా చేయకుండా ఎందుకు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు ఒకవైపు కాళేశ్వరం కూలిందని చెబుతూ.. మరోవైపు హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లు తెస్తామని రూ.7,000 కోట్లతో టెండర్లు వేశారని, కాళేశ్వరం కూలిపోతే హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లు ఎక్కడికెళ్లి వస్తాయి?’అని ప్రశ్నించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement