
సాగుపై సందిగ్ధం
● అన్నారం బ్యాక్‌వాటర్‌తో భూముల ముంపు ● క్రాప్ హాలీడేపై స్పష్టత ఇవ్వని సర్కార్ ● మూడు సీజన్‌లకు పరిహారం చెల్లించని వైనం ● అయోమయంలో అన్నదాతలు
మంథనిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బరాజ్ బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురయ్యే భూముల్లో వర్షాకాల సీజన్‌లో పంట సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధం రైతుల్లో నెలకొంది. మంథని మండలం మల్లారం, ఆరెంద గ్రామాలకు చెందిన సుమారు 250 మంది రైతులు 350 ఎకరాల్లో పంటల సాగుపై అయోమయంలో పడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముంపునకు గురయ్యే భూములకు క్రాప్ హాలీడే ప్రకటించి పరిహారం చెల్లించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాక్‌వాటర్ రాకపోవడంతో క్రాప్ హాలీ డేపై స్పష్టత లేక రైతులు పంటల సాగుకు ముందుకు రావడం లేదు.
ఎకరాకు రూ.24వేల చొప్పున
2020–23 వరకు అన్నారం బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురయ్యే భూములకు ఎకరాకు రూ.24వేల చొప్పున గత ప్రభుత్వం పరిహారం చెల్లించింది. కాగా మూడు సీజన్‌లకు సంబంధించి పరిహారం చెల్లించలేదని రైతులు చెబుతున్నారు.
క్రాప్‌హాలీ డేపై స్పష్టత కరువు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని బరాజీల గేట్లు ఎత్తివేశారు. ఇప్పటి వరకు నీరు నిల్వ చేయకపోవడంతో గతేడాది బ్యాక్‌వాటర్ రాలేదు. అయితే మల్లారం, ఆరెంద గ్రామాల్లోని ముంపు భూములకు క్రాప్ హాలీడేపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు పంటల సాగుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నాలుగెకరాలు ముంపులోనే..
నాకు నాలుగెకరాల భూమి ఉంది. మొత్తం అన్నారం బ్యాక్‌వాటర్‌లో ముంపునకు గురవుతది. ఈసారి బరాజ్‌లు నిండకపోవడంతో నీళ్లు రాలేదు. కానీ, భారీ వర్షాలు పడితే నీళ్లు నిలిచి మా భూములన్నీ మునిగిపోతాయి. కరకట్టలతో నీళ్లు మానేరులోకి వెళ్లక మళ్లీ మాకు నష్టమే జరిగేలా ఉంది.
– సుంకరి మహేశ్, రైతు, మల్లారం
రైతు భరోసా పైసలు పడలె
నాకున్న మూడెకరాలు బ్యాక్‌వాటర్‌లో మునిగిపోతాంది. గతంలో క్రాప్‌హాలీడే, రైతుబంధు పైసలు పడేవి. మూడు సీజన్‌లలో ఏ పైసలు రాలేదు. భూమిల పంట తీసుకోక, పైసలు రాక ఎట్లా బతుకుడు.
– ఆకుల రాజేశ్, రైతు, మల్లారం
నివేదికలు పంపినం
అన్నారం బ్యాక్‌వాటర్ ముంపు భూముల క్రాప్ హాలీడేకు సంబంధించి మూడు సీజన్‌ల పరిహారం నివేదికలు ప్రభుత్వానికి పంపాం. బడ్జెట్ కేటాయించగానే పరిహారం చెల్లింపులు జరుగుతాయి. దీనిపై ఎలాంటి సందేహాలు అవసరం లేదు.
– అంజనీ మిశ్రా, ఏడీఏ మంథని
‘ఈమె పేరు దామరపెల్లి సువర్ణ. భర్త మల్లారెడ్డి పెరాలసిస్‌తో మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సువర్ణ పని చేస్తేనే కుటుంబం గడుస్తుంది. అయితే ఈమెకు ఆరెంద తానిపంపు శివారులో ఎకరంన్నర భూమి ఉంది. ఆ భూమి అన్నారం బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురికాగా గత ప్రభుత్వం పరిహారం చెల్లిస్తూ వచ్చింది. మూడు సీజన్లుగా పరిహారం చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. పరిహారం, రైతుభరోసా రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతూ ఈ ఏడాది సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంది. ఇలా ఈమె ఒక్కరే కాదు ఆరెంద, మల్లారం గ్రామాలకు చెందిన సుమారు 250 మంది రైతుల్లో నెలకొన్న అయోమయం’.

సాగుపై సందిగ్ధం

సాగుపై సందిగ్ధం

సాగుపై సందిగ్ధం