
లఘుచిత్రాలతో సమాజంలో మార్పు
కోల్‌సిటీ/గోదావరిఖనిటౌన్: సమాజంలో మార్పునకు లఘుచిత్రాలు దోహదపడుతాయని గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ అన్నారు. ఆదివారం గాంధీచౌక్ చౌరస్తాలో తెలంగాణ లైఫ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో రాపల్లి కుమార్‌పటేల్ రచన, దర్శకత్వం, నిర్మాణంలో చిత్రీకరిస్తున్న ‘రక్షణ’ లఘుచిత్రం మొదటి షూటింగ్ సన్నివేశాన్ని ఏసీపీ క్లాప్ కొట్టి ప్రారంభించారు. విప్లవం, రౌడీయిజం, చదువు అనే మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని చిత్రీకరిస్తున్న రక్షణ లఘచిత్రం పలువురిలో మార్పు వచ్చేలా ఉండాలని ఆశించారు. సీనియర్ కళాకారుడు దామర శంకర్, దయానంద్‌గాంధీ, మ్యాజిక్ రాజా, చంద్రపాల్, కొమ్ము కుమార్‌యాదవ్, మేకల శ్రీకాంత్, పీఎన్ పటేల్, ఉపేందర్, విజయ్‌కుమార్, వంగ శ్రీనివాస్‌గౌడ్, నాగభూషణంగౌడ్, డాక్టర్ శంకర్‌లింగం, కళావతి, మధు పాల్గొన్నారు.
జునోటిక్, రేబీస్ వ్యాధులతో ముప్పు
పెద్దపల్లిరూరల్: జంతువుల నుంచి మానవులకు వ్యాధులు సంక్రమించే ప్రమాదముందని జిల్లా పశువైద్యాధికారి శంకర్ అన్నారు. పెద్దపల్లిలోని పశువైద్యశాలలో ఆదివారం ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా జంతువుల పెంపకం దారులకు అవగాహన కల్పించారు. ఏటా జూలై 6న ప్రపంచ జునోసిస్ దినోత్సవా న్ని నిర్వహిస్తున్నారని వివరించారు. వాతావరణ మార్పులతో జునోటిక్ వ్యాధులు ప్రబలే అవకాశముందన్నారు. జంతువుల నుంచి మానవులకు వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి, వాటిని ఎలా నివారించుకోవాలి అనే అంశాలపై పెంపకందారుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం వన్‌హెల్త్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని వివరించారు. రేబీస్ వ్యాధి నియంత్రణకు టీకా వేస్తున్నామన్నారు. పశువైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పంచాయతీల నిర్మాణానికి నిధులు మంజూరు
మంథని: మంథని నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 12 గ్రామపంచాయతీ నూతన భవనాల నిర్మాణానికి రూ.2.40 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి శ్రీధర్‌బాబు క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్కో భవనానికి రూ.20 లక్షలు కేటాయించారు. మండలంలోని అడవిసోమన్‌పల్లి, ఖానాపూర్, మల్లేపల్లి, ఆరెంద, ఉప్పట్ల, గోపాల్‌పూర్, తోటగోపయ్యపల్లి, ముత్తారం మండలం జిల్లల్లపల్లి పంచాయతీకి నిధులు మంజూరయ్యాయి. రామగిరి మండలం నాగెపల్లి, జల్లారం, ముస్త్యాల, కమాన్‌పూర్ మండలం సిద్దపల్లిలో నూతన భవనాలు నిర్మించనున్నారు.
పెద్దమ్మతల్లికి మాజీ ఎమ్మెల్యే మొక్కులు
గోదావరిఖనిటౌన్/యైటింక్లయిన్‌కాలనీ: రామగుండం నియోజకవర్గ ప్రజలపై పెద్దమ్మతల్లి ఆశీస్సులు ఉండాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం స్థానిక పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు నారాయణదాసు మారుతి, సట్టు శ్రీనివాస్, కోడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీలో పలువురిని పరామర్శించారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మేడి సదయ్య దంపతులు ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడగా, వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అలాగే చేతి గాయాలతో బాధపడుతున్న రాంచందర్, దాసరి శ్రీనివాస్‌ను పరామర్శించారు. మాజీ కార్పొరేటర్ స్టాలిన్‌గౌడ్, బాలరాజు, అంజలీదేవి తదితరులు ఉన్నారు.

లఘుచిత్రాలతో సమాజంలో మార్పు