
దోమ కుడుతోంది!
● దోమల మోత – ప్రజల వెత ● కానరాని నియంత్రణ చర్యలు ● మూలనపడిన ఫాగింగ్ యంత్రాలు ● మొక్కుబడిగా పారిశుధ్య పనులు ● జ్వరాల బారిన జిల్లావాసులు ● జిల్లాలోని బల్దియాల్లో దుస్థితి
సాక్షి, పెద్దపల్లి: వివిధ వ్యాధులు, జ్వరాలకు దోమలు కారణమువుతున్నాయి. వాటి బారినపడకుండా పుట్టకనే అడ్డుకోవాలి. ఆ తర్వాత అవి కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దురదృష్టవశాత్తు పట్టణాలు, పల్లెల్లోనేకాదు.. రామగుండం నగరంలోనూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. వాతావరణంలో మార్పులకుతోడు పారిశుధ్య నిర్వహణలో లోపం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలతో లోతట్టు కాలనీల్లోని నివాసాల నడుమ రోజుల తరబడి నీరు నిలిచి ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. దోమ కాటుతో ఆస్పత్రుల పాలవుతున్నారు. జ్వర పీడితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
అటకెక్కిన ఫాగింగ్ ప్రక్రియ
దోమల నివారణకు మూడు పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి. నీటి నిల్వల్లో దోమల నిరోధక మందు చల్లాలి. లార్వా వృద్ధి చెందకుండా రెండోసారి మందు పిచికారీ, మూడోసారి ఫాగింగ్ చేయాలి. ఖాళీ స్థలాలు, రహదారులపై మురుగు నిల్వ ఉండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఫాగింగ్‌తోపాటు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, కాలువల్లో మందు పిచీకారీ చేయడం క్రమం తప్పకుండా జరగాలి. వర్షాకాలం మొదలైన వెంటనే డ్రైనేజీల్లో గంబూషి యా చేపలు విడుదల చేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఎక్క డా కనిపించడంలేదు. దోమల నివారణకు మున్సిపాలిటీలు ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా.. ప్రయోజనం చేకూరడం లేదు.
దోమల నివారణ ఇలా..
ఇళ్ల పరిసరాలు, వ్యక్తిగత, కుటుంబపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా నీటినిల్వ ప్రదేశాలు గుర్తించారు. నీటిని తొలగించాలి. పనికిరాని పాత్రలు, టైర్లు, పగిలిన బకెట్లు, నీటి తొట్టెలు ఇళ్ల పరిసరాల్లో లేకుండా చూడాలి. ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటితొట్టెలపై మూతలు ఉంచాలి. వాటిని తరచూ శుభ్రం చేయాలి. ఇంటి పైకప్పు, టెర్రస్‌పైనా నీటి నిల్వలు ఉంచొద్దు. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించాలి. ఒకసారి వినియోగించి పారేసిన ప్లాస్టిక్ సంచులు, కప్పులు, గ్లాసులు డ్రైనేజీల్లో వేయరాదు. సెప్టిక్ ట్యాంకుల గాలిగొట్టాలకు నైలాన్ జాలి, ఇంటి కిటికీలు, గుమ్మాలకు జాలి, ఇనుప తెరలు అమర్చుకోవాలి. దోమతెరలు తప్పనిసరి వినియోగించాలి.
దోమల కాటు వ్యాధులు ఇవే..
దోమరకం వ్యాధి
అనాఫిలిస్ మలేరియా
క్యూలెక్స్ బోదకాలు, మెదడువాపు
ఏడీస్ డెంగీ, చికున్‌గున్యా
మాక్యోనియా బోదకాలు
ఇవి హ్యాండ్ ఫాగింగ్ మిషన్లు. సుమారు రూ.5లక్షలు వెచ్చించి రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కొనుగోలు చేశారు. దోమల నివారణ కోసం వీటిని వినియోగిస్తారు. ఈ ఏడాది మార్చి 11న ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ లాంఛ నంగా ప్రారంభించారు. అంతే.. అప్పట్నుంచి వినియోగించడంలేదు. ఇప్పటికే ఉన్న పాతవాటిని కూడా ఇలాగే మూలన పడేశారు. ఆటోట్రాలీలో ఏర్పాటు చేసిన రెండు పెద్దఫాగింగ్ మిషన్లలో ఒక్కదానితోనే.. అదికూడా మొక్కుబడిగా నగరంలో ఫాగింగ్ చేస్తున్నారు. దోమల నివారణ జరక్కపోగా.. అవి మరింత వృద్ధి చెంది ప్రజల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లోనూ ఇదే దుస్థితి కొనసాగుతోంది.
ఫాగింగ్ చేయాలి
గోదావరిఖనిలో దోమలు వృద్ధి చెందా యి. విపరీతంగా కుడుతున్నాయి. అధికారులు దోమల నివారణకు గతంలో వేగంగా చర్యలు తీసుకునేళ్లు. ఇప్పుడు ఫాగింగ్ కూడా చేయడం లేదు.
– బోళ్ల చంద్రశేఖర్, గోదావరిఖని
గంబూషియా చేపలు వదలాలి
ఇండ్ల నడుమ ఉన్న ఖాళీప్లాట్లు, గుంతల్లో వర్షపునీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్లాట్లను శుభ్రం చేసి నీటిగుంతల్లో గంబూషియా చేపలు వదిలి దోమల వృద్ధిని అరికట్టాలి.
– పిట్ట వినయ్, పెద్దపల్లి

దోమ కుడుతోంది!

దోమ కుడుతోంది!

దోమ కుడుతోంది!

దోమ కుడుతోంది!

దోమ కుడుతోంది!

దోమ కుడుతోంది!