
విద్యాప్రమాణాలు పెంపొందించాలి
పాలకుర్తి(రామగుండం): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం మండలంలోని కొత్తపల్లి, రామారావుపల్లి, పుట్నూర్, జయ్యారం, కన్నాల గ్రామాల్లోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం, కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం, పుట్నూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే మార్చి నాటికి ప్రతీ ప్రాథమికస్థాయి విద్యార్థి చదవడం, రాయడం, గణిత చతుర్విద ప్రక్రియలను చేసేలా తయారు చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే జయ్యారం ఉన్నత పాఠశాలలో గ్రౌండ్ లెవలింగ్, స్టేజీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. రామారావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం 400– 600 చదరపు గజాల లోపు మాత్రమే నిర్మించాలని, బిల్లులు సక్రమంగా అందేలా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పుట్నూర్ పీహెచ్‌సీలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని ఈజీఎస్ భవనంలో పలు విభాగల మండలస్థాయి అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. మండలవ్యాప్తంగా ఎస్సారెస్పీ కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని, పుట్నూర్‌లోని డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణాల స్థితిగతులపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలో లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌పాం సాగు జరిగేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని, వనమహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకాల పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఎంపీడీవో రామ్మోహనచారి, ఎంపీవో సుదర్శన్, ఏవో ప్రమోద్‌కుమార్, ఎంఈవో విమల, హౌజింగ్ డీఈ దస్తగిరి, పంచాయతీరాజ్ ఏఈ రుషికేష్, వైద్యాధికారి సాయిసూర్య, కేజీబీవి ప్రత్యేక అధికారి స్వరూప తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష