
ఓటరు జాబితాలో పొరపాట్లు ఉండొద్దు
పెద్దపల్లిరూరల్/జూలపల్లి/కాల్వశ్రీరాంపూర్: ఓటరు జాబితాలో పొరపాట్లకు అవకాశం లేకుండా రూపొందించాలని ఆర్డీవో గంగయ్య అన్నారు. గురువారం పెద్దపల్లి, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్‌లో బీఎల్‌వోలకు నిర్వహించిన బూత్‌స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఫాం 6,7,8 విచారణ, నివేదిక సమర్పించే విధానాలపై బీఎల్‌వో యాప్ వాడకం, ఓటరు జాబితా శుద్ధీకరణపై అవగాహన కల్పించారు. తహసీల్దార్లు రాజయ్య, జె.స్వర్ణ, జగదీశ్వర్‌రావు, డీటీ విజేందర్, సిబ్బంది, ట్రైనర్లు పాల్గొన్నారు.
పెద్దపల్లికి అడిషనల్ మున్సిఫ్ కోర్టు మంజూరు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలో అడిషనల్ మున్సిఫ్ కోర్టును మంజూరు చేస్తూ న్యాయశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంతంలో న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉండకుండా సత్వర సేవలందుతాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా కోర్టు, పోక్సో, సబ్‌కోర్టు, మున్సిఫ్‌కోర్టులు పెద్దపల్లి ప్రాంత ప్రజలకు న్యాయసేవలందిస్తున్నాయని వివరించారు. త్వరలోనే కోర్టు సముదాయాల భవన పనులు కూడా ప్రారంభం అవుతాయని తెలిపారు. అడిషనల్ మున్సిఫ్‌కోర్టు మంజూరుపై ఏజీపీ ఉప్పు రాజు, బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
సౌండ్‌పొల్యూషన్ చేసేవారిపై కఠిన చర్యలు
గోదావరిఖని(రామగుండం): ఇష్టారీతిన సైలెన్సర్లు బిగించుకుని సౌండ్ పొల్యూషన్ చేసే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం స్థానిక మున్సిపల్ టీజంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనానికి నంబర్ ప్లేట్లు సరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లను తీసివేయాలన్నారు. ఫోర్‌వీలర్ వాహనదారులు సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని, వాహనానికి సంబంధించిన పత్రాలను కలిగిఉండాలన్నారు. స్పీడ్‌గా డ్రైవ్ చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గోదావరిఖని, పెద్దపల్లి, మంచిర్యాల ట్రాఫిక్ సీఐలు రాజేశ్వరరావు, అనిల్, సత్యనారాయణ, ఎస్సైలు హరిశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
బయోమెట్రిక్‌తోనే వైద్యులకు వేతనాలు
మంథని: బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే వేతనాలు అందిస్తామని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల జిల్లా పర్యవేక్షణ అధికారి (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ శ్రీధర్ తెలిపారు. గురువారం మంథని సామాజిక వైద్యశాల, మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడి ఆస్పత్రి నుంచి ఇతర ఆస్పత్రులకు రెఫరల్ ఎందుకు జరుగుతున్నాయనే విషయంపై సమాచారం సేకరించామని అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైద్యులు అందుబాటులో ఉండేలా బయోమెట్రిక్ విధానం అమలులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, తాను పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే మాతాశిశు ఆస్పత్రిలో గర్భిణుల సౌకర్యార్థం అల్ట్రాసౌండ్ స్కాన్, నవజాత శిశువులకు ఫొటో థెరపీ, వార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి నుంచి రెడియోలజీ సేవలను వినియోగిస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మంథని ఆస్పత్రి పనిచేస్తుందని, తాను నిత్యం ఆస్పత్రిని సందర్శిస్తామని తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

ఓటరు జాబితాలో పొరపాట్లు ఉండొద్దు

ఓటరు జాబితాలో పొరపాట్లు ఉండొద్దు