
రేషన్.. పరేషాన్
● సర్వర్ డౌన్‌తో పంపిణీలో ఆలస్యం ● సాంకేతిక సమస్యలతోనూ తిప్పలు ● గంటల తరబడి తప్పని పడిగాపులు ● ఇబ్బందులు పడుతున్న డీలర్లు, రేషన్ లబ్ధిదారులు ● జిల్లాలో 86శాతం వరకే బియ్యం పంపిణీ
సాక్షి పెద్దపల్లి: వర్షాకాలంలో పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న కేంద్రప్రభుత్వం.. జూన్, జూ లై, ఆగస్టు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి.. ఈ జూన్‌లోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈనేపథ్యంలో మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని డీలర్లు ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. అ యితే, కనీస సౌకర్యాలు కరువై, సాంకేతిక సమస్య లు తలెత్తి, అధికమొత్తంలో ఒకేసారి బియ్యం పంపిణీ చేయడం తదితర కారణాలతో లబ్ధిదారులు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏర్పాట్లు చేయక ఇబ్బందులు..
మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకే సారి పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. అందుకు తగిన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా తెల్లరేషన్‌కార్డుదారులు రేషన్ దుకాణాల వద్ద అవస్థలు పడుతున్నారు. సన్నరకం బియ్యం అందుతాయో లేదోనన్న ఆందోళనతో బారులు తీరుతున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. మరోవైపు సర్వర్‌లో తలెత్తిన లోపంతో రోజంతా పడిగాపులు కాస్తున్నారు. కొందరు ఓపిక నశించి నిరాశతో ఇంటిదారి పడుతున్నారు. ఇలాంటి అవరోధాలను అధిగమిస్తున్న అధికార యంత్రాంగం ఇప్పటివరకు 86శాతం బియ్యం పంపిణీ పూర్తిచేసింది. కానీ, ఈనెలాఖరు వరకు లక్ష్యం చేరుకోవడం కష్టమేనని డీలర్లు అంటున్నారు.
బియ్యం నిల్వలకు స్థలం కొరత..
జిల్లాలోని రేషన్‌షాపులు చాలావరకు ఇరుకై న అద్దెగదుల్లో నడుస్తున్నాయి. ఏ నెలకు సరిపడా బియ్యం ఆ నెలలోనే పంపిణీ చేసి, నిల్వచేసేందుకే డీలర్లు అవస్థలు పడుతున్నారు. ఇక ఒకేసారి మూడు నెల ల బియ్యం నిల్వచేయాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొంతమొత్తంలోనే స్టాక్ తీసుకుంటున్నారు. ఆ బియ్యం పంపిణీ పూర్తయ్యాక మరికొంత తెచ్చుకుంటున్నారు. దీంతో చాలాషాపులు ‘నోస్టాక్’ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. దీనికితోడు రేషన్ బియ్యం ఎక్కడైనా తీసుకునే అవకాశం ఉండటంతో పట్టణ కేంద్రంలో నివాసం ఉండి, గ్రామాల్లో రేషన్‌కార్డులు ఉన్నవారు సైతం పట్టణాల్లోని దుకాణాల్లో బియ్యం తీసుకుంటున్నారు. ఇలా వచ్చేవారితో స్థానిక లబ్ధిదారులకు బియ్యం కొరత ఏర్పడుతోంది.
ఈ –పాస్ సాఫ్ట్‌వేర్‌లోనూ సమస్యలు..
ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తుండగా, ఇందులో కేంద్రప్రభుత్వం 5 కేజీలు, రాష్ట్రప్రభుత్వం మరో కేజీ అందిస్తోంది. మొత్తంగా ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే వారికిచ్చే 30 కేజీల బియ్యానికి లబ్ధిదారు మూడు నెలల రేషన్ కోసం ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు వేలిముద్ర తీసుకునే క్రమంలో సర్వర్‌లో సమస్య తలెత్తుతోంది. దీంతో బియ్యం పంపిణీలో మరింత ఆలస్యమవుతోంది. ఒక్కొక్కరికి బియ్యం ఇవ్వడానికి కనీసం 20 నిమిషాల వరకు సమయం పడుతోంది. సర్వర్ సమస్యతోపాటు వేలిముద్రలు త్వరగా రాకపోవడం, సాంకేతిక సమస్యలతో రోజుకు 100 మందికి మించి బియ్యం పంపిణీ చేయలేకపోతున్నామని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో రేషన్ సమాచారం
రేషన్ షాపులు 413
మొత్తం రేషన్‌కార్డులు 2,23,553
లబ్ధిదారుల సంఖ్య 6,66,912
మూడు నెలల కోటాబియ్యం (మెట్రిక్ టన్నుల్లో) 12,046
పంపిణీ చేసింది(శాతంలో) 86.22
చివరిదశకు పంపిణీ
జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ సజావుగా సాగుతోంది. మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాల్సి రావడం, ఒకేసారి ఆరుసార్లు బయోమెట్రిక్ తీసుకోవడంలో కొంతజాప్యమవుతోంది. అంతకుమించి ఎలాంటి సమస్యలు లేవు. రేషన్ షాపుల్లో స్టాక్ అయిపోతే వెంటనే సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం బియ్యం పంపిణీ చివరిదశకు చేరింది.
– రాజేందర్, డీఎస్‌వో

రేషన్.. పరేషాన్

రేషన్.. పరేషాన్