
● సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ జిల్లా నేత ఇ.నరేశ్
ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి
గోదావరిఖని: ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రప్రభుత్వం చేపట్టిన హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఇ.నరేశ్ డిమాండ్ చేశారు. స్థానిక పైలాన్ చౌరస్తా వద్ద శనివారం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతిచర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నరేంద్రమోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట 2026 కల్లా మావోయిస్టులను అంతం చేస్తామని ప్రకటించిందన్నారు. అప్పటి నుంచి కొనసాగిస్తున్న యుద్ధం.. అమాయక ఆదివాసీలతోపాటు మావోయిస్టు పార్టీ నాయకులను బూటకపు ఎన్‌కౌంటర్ల పేరిట హత్య చేస్తున్నారని ఆరోపించారు. బూటకపు ఎన్‌కౌంటర్లలో ఆదివాసీలే ఎక్కువ మంది మృతి చెందారని అన్నారు. ఖనిజ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంగా ఈహత్యాకాండ సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతిచర్చలను వెంటనే ప్రారంభించాలనే డిమాండ్‌తో ఈనెల 25న వరంగల్‌లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.కృష్ణ, నాయకులు రాజేశం, దుర్గయ్య, మల్లేశం, రాజన్న, కొమురయ్య, ప్రసాద్, రవికుమార్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.